Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్లు... నిండుకుండలా నాగార్జున సాగర్, రేపు గేట్లు ఎత్తివేత..!-the water level of nagarjuna sagar crossed 571 feet gates are likely to be lifted at any moment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్లు... నిండుకుండలా నాగార్జున సాగర్, రేపు గేట్లు ఎత్తివేత..!

Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్లు... నిండుకుండలా నాగార్జున సాగర్, రేపు గేట్లు ఎత్తివేత..!

Krishna River Project Updates : కృష్ణమ్మ పరుగులతో జలాశయాలు నిండుగా మారాయి. ఇప్పటికే శ్రీశైలం గేట్లు ఎత్తగా…. సాగర్ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.

నాగార్జున సాగర్ కు భారీగా వరద

ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. పైనుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి భారీగా నీటిని దిగువుకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ కూడా నిండుకుండలా మారిపోయింది.

సాగర్ ప్రాజెక్ట్ లోని నీటి వివరాలు….

ఆదివారం(ఆగస్టు 04) ఉదయం 8.01 గంటల రిపోర్ట్ ప్రకారం…. నీటిమట్టం 571.4 అడుగులకు చేరింది. సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 260.09 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

ఇక ఇన్ ఫ్లో 3,96,214 క్యూసెకులుగా నమోదు కాగా… 37,999 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 19 అడుగుల మేర నీటిమట్టం చేరుకుంటే… గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. భారీగా ఇన్ ఫ్లో ఉండటంతో రేపు సాయంత్రం గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. మొదటగా కొంత మేర క్రస్ట్ గేట్లు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు.

శ్రీశైలంలో ఇవాళ్టి పరిస్థితి….

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఉదయం 7:03 గంటల రిపోర్ట్ ప్రకారం….. ఇన్ ఫ్లో 4,06,236 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 5,50,731 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.2 అడుగులకు చేరింది. పూర్తి నీటి సామర్థ్యం 215.81గా ఉండగా….ప్రస్తుతం 200.2  గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

మరోవైపు శ్రీశైలం వచ్చే టూరిస్టుల సంఖ్య పెరిగింది. ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ పెరిగింది.  కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది.  నెమ్మదిగా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఉంది. ఇక మల్లిఖార్జునస్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. 

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. ఆదివారం ఉదయం 6:35 గంటల రిపోర్ట్ ప్రకారం… 124.61 అడుగుల నీటిమట్టం ఉంది. 4.98 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 25,701 క్యూసెకులుగా ఉండగా… ఔట్ ఫ్లో 2,532 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరనుంది. ఆ తర్వాత పులిచింతల గేట్లు కూడా ఎత్తుతారు.

NOTE : ఎగువ నుంచి వస్తున్న వరదతో ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వల గణాంకాలు మారుతుంటాయి. ఆ వివరాలను https://apwrims.ap.gov.in/mis/reservoir/  లింక్ పై క్లిక్ చేసి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చు