Supeme Court On GO 1 : హైకోర్టు తీర్పుపై జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరణ…..-the supreme court refused to interfere with the orders of the ap high court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  The Supreme Court Refused To Interfere With The Orders Of The Ap High Court

Supeme Court On GO 1 : హైకోర్టు తీర్పుపై జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరణ…..

HT Telugu Desk HT Telugu
Jan 20, 2023 12:35 PM IST

Supeme Court On GO 1 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 1పై సస్పెన్షన్ విధిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ హైకోర్టులో కేసు విచారణ జరుగనున్న నేపథ్యంలో సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో జీవో నంబర్ 1 భవితవ్యం ఏపీ హైకోర్టులో తేలనుంది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

Supeme Court On GO 1 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట దక్కలేదు. జీవో నంబర్ 1 అమలును తాత్కలికంగా సస్పెండ్‌ చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్వర్వులను సస్పెండ్ చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. కేసు మెరిట్స్‌లోనికి వెళ్లకుండానే విచారణను కోర్టు వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో 23వ తేదీన విచారణ జరగాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులు కూడా అన్ని అంశాలను డివిజన్ బెంచ్‌ ముందు ప్రస్తావించవచ్చన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 1అమలును తాత్కలికంగా సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్రంలోని రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాల విషయంలో జారీ చేసిన జీవో 1 అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో ఏపీ హైకోర్టు తప్పు చేసిందని పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి రెండో తేదీన జీవోను తీసుకొచ్చింది. రాజకీయ పార్టీల గొంతు నొక్కేందుకు జీవో తెచ్చారని ఆరోపిస్తూ, ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

పోలీస్‌ యాక్ట్‌ విరుద్ధంగా ఉండటంతో జీవోపై వేటు….

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 12న హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు బెంచ్‌ కు విచారణ అర్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం కూడా తెలిపింది. జీవో నెెంబర్ 1 పోలీసు చట్టం సెక్షన్‌ 30కి విరుద్ధంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును ఈ నెల 23 వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పిటిషన్ విచారణను ఈనెల 20కి వాయిదా వేస్తూ కౌంటరు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు.

సభలు నిషేధించలేదన్న ప్రభుత్వం….

జీవో 1 ద్వారా బహిరంగ సమావేశాలను నిషేధించలేదని, సహేతుకమైన షరతులు విధించడం, ప్రత్యామ్నాయ స్థలాలు సూచించడంపై పోలీసులకు అనుమతిచ్చారని, ప్రాథమిక దశలోనే జోక్యం చేసుకుని జీవో అమలును నిలిపి వేయడంలో హైకోర్టు పొరపాటు చేసిందని లీవ్‌ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

కందుకూరులో టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయిన ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్‌ పిటిషన్‌లో కోరింది. 20వ తేదీన హైకోర్టులో ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో అత్యవసరంగా విచారించాలని కోరడంతో గురువారం విచారణ జరుపుతామని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.

కౌంటరు వేసేందుకు ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఉండాల్సిందని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. పౌరుల భద్రత కోసం తీసుకొచ్చిన జీవో అమలును నిలిపేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జీవోలో పేర్కొన్న విషయాలు పాలనాపరమైనవని, రహదారులపై బహిరంగ సమావేశాల నిర్వహణ విషయంలో పోలీసు చట్టంలోని అధికారాల వినియోగానికి సంబంధించినవని వివరించారు.

మరోవైపు జనవరి 23న ఏపీ హైకోర్టు ముందుకు కేసు విచారణకు రానున్న నేపథ్యంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినిపించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించకపోతే మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.

WhatsApp channel

టాపిక్