Tirumala Updates : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ - శ్రీవారి సర్వదర్శానికి 30 గంటలు
Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సర్వదర్శానికి 24 నుంచి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.
Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా భక్తుల రాక ఎక్కువగా ఉండటంతో… దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. ఇక వీకెండ్స్ లో అయితే భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది.
వేసవి సెలవులు ఉండటంతో అన్ని రాష్ట్రాల నుంచి శ్రీవారి భక్తులు దర్శనానకిి తరలివస్తున్నారు. త్వరలోనే పిల్లలకు సెలవులు కూడా ముగియనున్నాయి. దీంతో ఈలోపే తిరుమలకు వెళ్లేందుకు చాలా మంది భక్తులు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో గత 15 రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. తాజా పరిస్థితి చూస్తే…. అన్ని కంపార్ట్‌మెంట్లు కూడా భక్తులతో నిండిపోయి ఉన్నాయి. కంపార్ట్‌మెంట్లు అన్ని నిండిపోవటంతో వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
బ్రేక్ దర్శనాలు రద్దు….
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వ తేదీ వరకు(శుక్ర, శని, ఆదివారం తేదీలు)వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సుల లేఖలు కూడా స్వీకరించబడవని స్పష్టం చేసింది.
శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ పేర్కొంది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 - 40 గంటల సమయం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే...బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది. టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చే భక్తుల సంఖ్య తిరుమలలో పెరిగిపోయింది.క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలు…
ఇవాళ్టి నుంచి జూన్ 5వ తేదీ వరకు తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ ఐదు రోజులు పాటు ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతోపాటు జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
హనుమత్ జయంతి సందర్భంగా ఆకాశ గంగలోని శ్రీ అంజనాదేవి- శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో ఈ ఐదు రోజుల పాటు ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. మొదటి రోజు జూన్ 1న మల్లెపూలు, జూన్ 2న తమలపాకులు, జూన్ 3న ఎర్ర గన్నేరు మరియు కనకాంబరం, జూన్ 4న చామంతి మరియు చివరి రోజైన జూన్ 5న సింధూరంతో అభిషేకం చేస్తారు.
వేద పండితులచే శ్రీ ఆంజనేయ సహస్ర నామార్చన, మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి, అంజనాదేవికి అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ఆకాశ గంగ వద్ద శ్రీ ఆంజనేయ జన్మ వృత్తాంతంపై ప్రవచన కార్యక్రమం ఉంటుంది.
ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పారాయణం నిర్వహించనున్నారు. జూన్ 1న హరికథ, జూన్ 2 న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే సంకీర్తనలు, జూన్ 3న పురంధర దాస సంకీర్తనలు, జూన్ 4న హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే భజన, జూన్ 5న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే హరికథ గానం నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు ఉంటాయి.