Amaravati Real Estate : అమరావతిలో రియల్ ఎస్టేట్ ఊపు.. మళ్లీ ఊపిరి పోస్తున్న చంద్రబాబు!
Amaravati Real Estate : ఏపీలో చంద్రబాబు సీఎం మళ్లీ సీఎం అయ్యాక.. రియల్ ఎస్టేట్ రంగం చాలా చురుగ్గా మారింది. కానీ.. ఇటీవల కొన్ని పరిణామాల వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత అస్థిరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రంగానికి మళ్లీ ఊపిరి పోస్తోంది.
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి సంకల్పంతో ఉన్నారు. అందుకే పక్కా ప్రణాళికతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టులు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అమరావతిలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇటీవలి కాలంలో ధరలు కొంత స్థిరపడ్డాయి.
అమరావతిలో భూముల ధరలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా భూముల ధరలు పెరుగుతూ.. తగ్గుతున్నాయి.
చంద్రబాబు కీలక నిర్ణయం..
అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి ప్రభుత్వం వివిధ నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. చంద్రబాబు కూడా వ్యక్తిగతంలో ఇందుకోసం కృషి చేస్తున్నారు. అమరావతిపై అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించేందుకు చంద్రబాబు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. కోర్ క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించి రూ.11వేల కోట్లతో పనుల్ని చేపట్టడానికి ఇటీవల అమోద ముద్ర వేశారు. వచ్చే ఏడాది కల్లా వీటిలో చాలా నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో రాజధానిలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చంద్రబాబు స్థలాన్ని కొనుగోలు చేశారు.
మళ్లీ ఊపు..
2019లో ప్రభుత్వం మారక ముందే చాలామంది ప్రముఖులు అమరావతిలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. రైతుల వాటాగా దక్కిన ఫ్లాట్లకు భారీగా ధరలు లభించాయి. అప్పుడు చదరపు గజం 40 నుంచి 45వేల రూపాయల వరకు ధర పలికింది. ఇటీవల చంద్రబాబు ఇంటి స్థలం కొనుగోలు చేయడంతో.. అమరావతి రియల్ ఎస్టేట్‌కు ఊపు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు హ‍్యాపీనెస్ట్ పథకాన్ని కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 1200 రెసిడెన్షియల్ ఫ్లాట్లను నిర్మించనున్నారు.
పెట్టుబడి పెట్టాలంటే..
1.అమరావతిలో భూముల ధరలు పెరుగుతాయనే ఆలోచన చాలామందికి ఉంది. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ ఆసక్తి ఉంటే.. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకోండి. ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయో లేదో, నిర్మాణం ఎంతవరకు పూర్తయింది, అభివృద్ధిదారుడు ఎవరు వంటి విషయాలను పరిశీలించండం ముఖ్యం.
2.మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాపర్టీ స్థానం చాలా ముఖ్యం. మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటివి ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయో లేదో చూడండి.
3.ప్రాపర్టీ ధర సరైనదేనా అని పరిశీలించండి. మార్కెట్‌లో ఇదే రకమైన ప్రాపర్టీల ధరలను పోల్చండి. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని చట్టపరమైన విషయాలను పరిశీలించండి. ప్రాపర్టీపై ఎలాంటి ఆధారాలు లేవో.. లేదా అప్పులు ఉన్నాయో లేదో తెలుసుకోండి.
4.అమరావతిలో పెట్టుబడి గురించి రియల్ ఎస్టేట్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. వారు సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ముందు సమగ్రంగా పరిశోధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది పెద్ద మొత్తంలో పెట్టుబడి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.