Postal Department : తపాలా శాఖ కీలక నిర్ణయం.. ఇంటివద్దకే డిజిటలైజేషన్ లైఫ్ సర్టిఫికెట్
Postal Department : చాలామంది విశ్రాంత ఉద్యోగులు నడవలేని పరిస్థితుల్లో ఉంటారు. బయటకు రాలేని స్థితిలో మరికొందరు ఉంటారు. అలాంటి వారికి తపాలా శాఖ శుభవార్త చెప్పింది. ప్రతీ ఏడాది సమర్పించాల్సిన డిజిటలైజేషన్ లైఫ్ సర్టిఫికెట్‌ను ఇంటివద్దకే పంపాలని నిర్ణయించింది.
విశ్రాంత ఉద్యోగుల కోసం పోస్టల్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటలైజేషన్ లైఫ్ సర్టిఫికెట్‌ను ఇంటి వద్దకే పంపిస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలలో తప్పనిసరిగా డిజిటలైజేషన్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. అయితే.. గతంలో దీని కోసం విశ్రాంత ఉద్యోగులు బ్యాంకులు, ట్రెజరీ కార్యాలయాలకు చుట్టూ తిరిగేవారు.
ఇటీవలే ఆన్‌లైన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ప్రక్రియ మొత్తం ఇంటి వద్దనే పూర్తి చేసుకునే అవకాశం ఉంది. తపాలా శాఖ ఈ సౌకర్యాన్ని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తోంది. విశ్రాంత ఉద్యోగులు తమ పోస్ట్‌మాన్‌కు సమాచారం అందిస్తే.. చాలు మొత్తం ప్రక్రియను వారు పూర్తి చేస్తారు. ఏపీలోని విజయవాడ పరిధిలో ఉన్న అన్ని సబ్, హెడ్ పోస్టాఫీసు పరిధిలో ఈ సౌకర్యం ఉంది.
ఈ కార్యక్రమంపై తపాలా శాఖ అవగాహన కల్పిస్తోంది. మంచానికే పరిమితమై, అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్నవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. మామూలుగా ఉన్నవారు పోస్టాఫీసుకు వెళ్లి అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలి. రూ.70 చెల్లిస్తే డిజిటలైజేషన్ లైఫ్ సర్టిఫికెట్‌ను ఇస్తారు.
రిటైర్డ్ ఎంప్లాయీస్ తమ ఫోన్‌లో పోస్ట్‌ఇన్‌ఫో అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యాప్ ద్వారా రిక్వెస్ట్ పెడితే.. పోస్టాఫీసు సిబ్బంది ఇంటికి వచ్చి డిజిటలైజేషన్ లైఫ్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. బయోమెట్రిక్ యంత్రం ద్వారా వేలిముద్ర వేస్తే సరిపోతుందని.. చెబుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పింఛన్‌దారులు.. బయోమెట్రిక్ పద్ధతిలో తమ జీవన ధ్రువీకరణ పత్రం సమర్పించేందుకు వీలు కల్పిస్తున్న పథకమే జీవన ప్రమాణ్. ఇది 2015, జూన్ 30 నుంచి అమలులోకి వచ్చింది. పింఛను చెల్లింపు అధికారుల ముందు భౌతికంగా హాజరుకావాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న పింఛన్‌దారులకు ప్రయాస తప్పింది. మొబైల్ యాప్‌లో ఎలక్ట్రాన్ పద్ధతిలో కూడా డిజిటల్ ధ్రువపత్రాలు సమర్పించవచ్చు. 2021-22 నాటికి 8.38 లక్షల లైఫ్ సర్టిఫికెట్లు ఈ కేంద్రాల్లో ఇచ్చారు.