Visakha Fire Accident: ప్రమాదం కాదు, మద్యం మత్తులో బోట్లు తగులబెట్టేశారు…
Visakha Fire Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేసిందేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో ఓ యూ ట్యూబర్, అతని స్నేహితులు బోటుకు నిప్పు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
Visakha Fire Accident: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగలేదని కావాలనే కొందరు బోట్లకు నిప్పు పెట్టినట్టు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి ఒకటో నంబర్ జెట్టీ వద్ద ఓ యూట్యూబర్‌కు, బాలాజీ అనే వ్యక్తికి మధ్య ఘర్షణ జరిగినట్టు గుర్తించారు.
లంగరు వేసిన బోటులో యూట్యూబర్‌తో పాటు మరో వ్యక్తికి మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం యూ ట్యూబర్ తన బోటును బాలాజీ అనే వ్యక్తికి విక్రయించాడు. ఈ క్రమంలో కొంత నగదును సదరు యూ ట్యూబర్‌కు బాలాజీ చెల్లించాడు. ఇటీవల తాను ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయాలని బాలాజీ ఒత్తిడి చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి బోటు వద్ద ఇద్దరికి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టు మత్స్యకారులు చెబుతున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో బోటును తగుల బెట్టినట్లు అనుమానిస్తున్నారు.
ఒకటో నంబర్ జెట్టీ వద్ద బోట్లలో మంటలు చెలరేగడంతో ఆవేశంలో బోటుకు నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో కొందరు యువకులు బోటుకు నిప్పు పెట్టినట్టు విశాఖపట్నం జేసీ విశ్వనాథం నిర్ధారించారు. ప్రమాదంలో 40 నుంచి 50 వరకు బోట్లు తగులబడ్డాయని తెలిపారు. ఒక్కో ఓటు ఖరీదు 50 నుంచి 70లక్షల వరకు ఖరీదు చేస్తాయని, ఎంత మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు యూట్యూబర్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో కనీసం రూ.50-75కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ మత్స్యాకారులు హార్బర్‌లో ఆందోళన చేస్తున్నారు.