CRDA Limits: సిఆర్‌డిఏ పరిధి పెంచుతూ ఉత్తర్వులు, గతంలో కుదించిన వైసీపీ ప్రభుత్వం-the orders increasing the boundaries of crda the ycp govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Crda Limits: సిఆర్‌డిఏ పరిధి పెంచుతూ ఉత్తర్వులు, గతంలో కుదించిన వైసీపీ ప్రభుత్వం

CRDA Limits: సిఆర్‌డిఏ పరిధి పెంచుతూ ఉత్తర్వులు, గతంలో కుదించిన వైసీపీ ప్రభుత్వం

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 13, 2024 07:46 AM IST

CRDA Limits: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిని పూర్వపు స్థితికి చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్‌ నిర్ణయానికి అనుగుణంగా పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిఆర్‌డిఏ పరిధి 8వేల చదరపు కిలోమీటర్లకు పెరిగింది.

సీఆర్‌డిఏకు పూర్వ వైభవం
సీఆర్‌డిఏకు పూర్వ వైభవం

CRDA Limits: ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని కుదించడంతో అమరావతి పరిధి గణనీయంగా తగ్గిపోయింది. దీనిని పూర్వపు స్థితికి చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్‌డిఏ ఏర్పాటైన సమయంలో భవిష్యత్ అవసరాలతో పాటు భారీ నగరాన్ని నిర్మించే లక్ష్యంతో సిఆర్‌డిఏను విజయవాడ-గుంటూరు నగరాల చుట్టూ 8వేల చదరపు కిలోమీటర్ల పరిధి నిర్ణయించారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పరిధిని ,సిఆర్‌డిఏ పరిధిని కుదించారు. పల్నాడు, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. తాజాగా పూర్వపు సిఆర్‌డిఏ పరిధిని పునరుద్ధరిస్తూ మునిసిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. సత్తెనపల్లి పురపాలక సంఘంతో పాటు పల్నాడు జిల్లాలోని 92గ్రామాల్లోని 1,069.55చదరపు కి.మీ విస్తీర్ణానికి పెంచారు. దీంతో పాటు బాపట్లలో 562.41 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కలిపి మొత్తం 1631.96చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సీఆర్‌డిఏలోకి చేరుస్తూ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ సీఆర్‌డిఏ పరిధి, విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఉమ్మడి గుంటూరులోని బాపట్ల, పల్నాడు జిల్లాల్లో గత ప్రభుత్వం విడదీసిన పలు ప్రాంతాలను తిరిగి సీఆర్డీఏలో విలీనం చేస్తూ పురపాలక శాఖ మంగళవారం జీవో విడుదల చేసింది.

తాజా నిర్ణయంతో సీఆర్డీఏ విస్తీర్ణం 6,983.24 చదరపు కి.మీ నుంచి 8,352 69 చ.కి.మీకు పెరిగింది. సీఆర్‌డిఏ పరిధి పెంపుదలపై ఆగస్టు 2న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డిఏ ఆథారిటీ సమావేశంలో తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఆర్‌డిఏ విస్తీర్ణం పెంపుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేయడంతో తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఆర్డీఏ నుంచి వేమూరు నియోజకవ ర్గాన్ని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో భాగం చేశారు. సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ఉన్న ప్రాంతాలను విడదీసి పల్నాడు ఆర్బన్ డెవ లప్మెంట్ ఆధారిటీలో విలీనం చేశారు. దీంతో సీఆర్‌డిఏ పరిధి గణనీయంగా తగ్గిపోయింది. సీఆర్‌డిఏ పరిధిని కుదించేందుకు ఇలా చేశారనే విమర్శలు ఉన్నాయి.

గతంలో సీఆర్డీఏ పరిధిలో ఉన్న సత్తెన పల్లి మునిసిపాలిటీలోని 21.88 చ కి.మీతో పాటు సత్తెనపల్లి మండలం, పెదకూరపాడు నియో జకవర్గంలోని పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాలు, చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలాలను పల్నాడు డెవలప్‌మెంట్‌ అథారిటీలో కలిపారు. వాటిని ఇప్పుడు సీఆర్డీఏలో కలిపారు.

సత్తెనపల్లి మున్సిపాలిటీతో పాటు గ్రామీణ మండలం, పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, ఆచ్చంపేట, యడ్లపాడు మండలాల్లోని 82 గ్రామాల పరిధిలో 1,069.55 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థలో కలిసింది. దీంతో పాటు వేమూరు నియోజక వర్గంలోని ఐదు మండలాలను 562. 41 చ కి.మీ విస్తీర్ణాన్ని సీఆర్డీఏ నుంచి విడగొట్టి బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో విలీనం చేశారు. చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాలను కూడా బుడాలో కలిపారు. తాజా నిర్ణయంతో ఈ మండలాల పరిధి లోని 62 గ్రామాలు సీఆర్డీఏలో విలీనమైనట్టైంది.

Whats_app_banner