CEC AP Review: తటస్థంగా పని చేయాల్సిందే.. ప్రభుత్వ అధికారులకు సీఈసీ ఆర్డర్
CEC AP Review: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులంతా తటస్థంగా పనిచేయాల్సిందేనని, అలా చేయలేని వారు విధుల నుంచి తప్పుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశించారు.
'CEC AP Review: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదులు, ఆరోపణలు రావడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విజయవాడలో నిర్వహించిన ఎన్నికల సన్నాహాక సమావేశంలో ప్రభుత్వ అధికారులు తటస్థంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారుల పనితీరుపై తమ వద్ద సమగ్ర నివేదికలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏపీలో ఏమి జరుగుతుందో పూర్తి అవగాహన తమకు ఉందని సీఈసీ వ్యాఖ్యనించారు. అధికారులు ఎలా పనిచేస్తున్నారో గమనిస్తున్నామని, ప్రతి ఒక్క అధికారి పనితీరుపై తమ వద్ద నివేదికలు ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వ అధికారులు పార్టీలు, నాయకులకు మేలు చేసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు. కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతూ, ఆయా పార్టీలు, నాయకులతో అనుబంధం కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులున్నాయని, అలాంటివారిని ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా, తటస్థంగా ఉండలేమని ఎవరైనా భావిస్తే తప్పుకోవాలని, ఫిర్యాదులపై తాము చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిక జారీచేసింది. ఏపీలో రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్‌చంద్ర పాండేలతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడ నోవోటెల్ హోటల్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించింది.
ఏపీలో ప్రత్యేకించి కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులందుతున్నాయని.. వాటిని ఎందుకు పరిష్కరించట్లేదని ప్రశ్నించింది. మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ వివిధ పార్టీల ప్రతినిధులతో భేటీ అయిన కేంద్ర ఎన్నికల బృందం.. వారినుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
దొంగ ఓట్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా నకిలీ ఓటరు కార్డులు సృష్టించి భారీగా దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో నిందితులెవరో, బాధ్యులెవరో రెండున్నరేళ్లు అవుతున్నా ఎందుకు గుర్తించలేదని తిరుపతి కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని ఎన్నికల కమిషనర్లు నిలదీశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. కలెక్టర్ చెప్పిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
చంద్రగిరి నియోజకవర్గంలో కొత్తగా ఓట్ల నమోదుకు వేల ఫాం-6 దరఖాస్తులు ఎలా వస్తాయని ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ విషయంలో ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తిరుపతి జిల్లాలో వచ్చిన ఫిర్యాదులు, అక్రమాలపై జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల సంఘం నిలదీయడంతో మిగతా జిల్లాల కలెక్టర్లు ఆందోళన చెందారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా, కడప కలెక్టర్ విజయరామరాజు, బాపట్ల కలెక్టర్ రంజిత్‌బాషాపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన ఫిర్యాదులు దగ్గర పెట్టుకున్న సీఈసీ బృందం కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడినప్పుడు అక్కడ వచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విచారణ ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
విజయవాడ సీపీపై ఆగ్రహం…
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాపై సీఈసీ బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనిఖీల ద్వారా ఎంత డబ్బు, మద్యం పట్టుకున్నారని ప్రశ్నలు వర్షం కురిపించింది. సీపీ కాంతి రాణా సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏ మాత్రం సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనంతపురం సరిహద్దుల్లోకి కర్ణాటక నుంచి భారీగా మద్యం వస్తున్నా ఎందుకు పట్టుకోవట్లేదంటూ ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. సరిహద్దుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎందుకు సరిగ్గా లేదని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించింది. ఎన్నికల విధుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వేటు తప్పదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిర్దిష్టమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. దీంతో ఎన్నికల సంఘం ఎవరిపై వేటు వేస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అన్ని గుర్తింపు రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘంతో సమావేశమయ్యే అవకాశాన్ని కల్పించారు.