Kakinada : వినాయక వైన్స్ వారి బంపరాఫర్.. మందు తాగండి.. థాయ్‌లాండ్‌కు వెళ్లండి!-the operators of vinayaka wines in kakinada announced an offer for liquor lovers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kakinada : వినాయక వైన్స్ వారి బంపరాఫర్.. మందు తాగండి.. థాయ్‌లాండ్‌కు వెళ్లండి!

Kakinada : వినాయక వైన్స్ వారి బంపరాఫర్.. మందు తాగండి.. థాయ్‌లాండ్‌కు వెళ్లండి!

Basani Shiva Kumar HT Telugu
Feb 03, 2025 09:44 AM IST

Kakinada : ఏపీలో వైన్ షాపులను దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు లక్షల్లో వెచ్చించారు. కొన్ని చోట్ల ఎంతో కష్టపడి షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. దీంతో ఆఫర్లు ప్రకటిస్తూ.. మందుబాబులను ఆకర్షిస్తున్నారు. తాజాగా కాకినాడలో ప్రకటించిన ఆఫర్ వైరల్ అవుతోంది.

వినాయక వైన్స్ వారి బంపరాఫర్
వినాయక వైన్స్ వారి బంపరాఫర్

మనం ఆన్‌లైన్‌లో చూస్తుంటాం.. బై వన్.. గెట్ టు అని. లేకపోతే భారీ డిస్కౌంట్, ఆఫర్ సేల్ వంటి ప్రకటనలు చూస్తుంటాం. కొన్నిసార్లు క్లియరెన్స్ సేల్ అని తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తారు. ఇవన్నీ కామన్. కానీ కాకినాడలో ఓ మద్యం వ్యాపారీ వినూత్నంగా ఆలోచించాడు. లిక్కర్ సేల్స్ పెంచుకోవడానికి ఊహించని ఆఫర్ ఇచ్చాడు. దీంతో మందుబాబులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

yearly horoscope entry point

వినూత్న ఆఫర్..

కాకినాడలోని వినాయక వైన్స్ నిర్వాహకులు వినూత్న ఆఫర్ ప్రకటించారు. మందు తాగండి .. థాయ్​లాండ్​ వెళ్లండి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తమ దుకాణంలో అన్నిరకాల బ్రాండ్లు దొరుకుతాయని.. మద్యం కొన్న వారికి టోకెన్లు ఇస్తామని ప్రకటించారు. కావాల్సిన బ్రాండ్​‌ను తాగడమే కాదు.. ఫ్రీగా థాయ్​లాండ్​ వెళ్లే అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ ఆఫర్ ఇచ్చారు.

లక్కు కోసం లిక్కర్..

మందుబాబులు తమ షాపులో లిక్కర్ కొంటే.. టోకెన్​ ఇస్తామని.. వాటిని లాటరీ తీస్తామని చెబుతున్నారు. లాటరీలో పేర్లు ఉన్నవారికి కారు, బైక్​, సెల్​ఫోన్​ వంటి గిఫ్ట్​లను కూడా ఇస్తామని ప్రకటించారు. లాటరీలో మొదటి బహుమతిగా.. థాయ్​లాండ్​ వెళ్లొచ్చు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఆఫర్ ఇప్పుడు ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ ప్రకటన చూసిన మందుబాబులు.. కిక్కు కోసం కాకున్నా.. లక్కు కోసం లిక్కర్ ఎక్కిస్తున్నారు.

గతంలోనూ..

ఇప్పుడే కాదు.. గతంలోనూ వైన్స్ నిర్వాహకులు వివిధ ఆఫర్లు ప్రకటించారు. ఇటీవల అన్నమయ్య జిల్లా, రాజంపేట ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు ఆఫర్ల బ్యానర్లు దర్శనమిచ్చాయి. 'ఈ షాపులో క్వాటర్ కొంటే.. మందు తోపాటు ఓ గుడ్డు, ఓ గ్లాసు, ఓ వాటర్ ప్యాకెట్ ఫ్రీ' అని బ్యానర్లు పెట్టారు. లిక్కర్ సేల్స్ పెంచుకోవడానికి వైన్ షాపుల నిర్వాహకులు ఈ ప్లాన్ వేశారు. ఈ ఆఫర్ ప్రకటించిన తర్వాత ఆయా షాపుల్లో లిక్కర్ సేల్స్ పెరిగాయని అంటున్నారు.

నెలకు లక్ష వరకు ఖర్చు..

ఏపీలో చాలాచోట్ల మద్యం షాపులకు టెండర్లు వేసిన వారు బయట నుంచి అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టారు. తక్కువ వడ్డీకి తీసుకొచ్చినా.. లక్షలకు రెండు రూపాయలు ఉంటుంది. తక్కువలో తక్కువ రూ.20 లక్షల వరకు అప్పులు చేసిన షాపులు పెట్టిన వారు ఎందరో ఉన్నారు. ఆ అప్పునకు నెలకు రూ.40 వేలు వడ్డీ అవుతుంది. ఆ వడ్డీ, సిబ్బంది జీతాలు, షాపు నిర్వహణ ఖర్చులు.. అన్నీ కలిపి నెలకు లక్ష రూపాయలకు వరకు అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

లాభాలు రావాలంటే..

ఆ ఖర్చులన్నీ పోనూ లాభాలు రావాలంటే అమ్మకాలు భారీగా ఉండాలి. ఏదో ఆశించి టెండర్లు వేశామని.. కానీ అనుకున్న స్థాయిలో అమ్మకాలు లేవని వ్యాపారులు వాపోతున్నారు. అందుకే లాభాలు రాకపోయిన పర్వాలేదు.. కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలని ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నట్టు మద్యం దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు.

Whats_app_banner