AP DSC 2024 : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. వారం రోజుల్లో గుడ్‌న్యూస్!
AP DSC 2024 : కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈసారి ఎలాగైన కోలువు సాధించాలని పట్టుదలగా చదువుతున్నారు. దీంతో విజయవాడ, గుంటూరు, అవనిగడ్డలోని శిక్షణా కేంద్రాలు హౌస్ ఫుల్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. నోటిఫికేషన్ విడుదల చేయడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ విడుదల తేదీ దగ్గర పడటంతో.. అభ్యర్థులు గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు.
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులతో.. విజయవాడ, అవనిగడ్డ, గుంటూరులోని శిక్షణ కేంద్రాలు రద్దీగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అభ్యర్థులు విజయవాడకు తరలివచ్చి శిక్షణ కేంద్రాల్లో రాత్రీపగలు చదువుతున్నారు. కొలువు సాధించాకే ఇళ్లకు వెళ్తామని చెబుతున్నారు. ఉదయం 6 గంటలకే శిక్షణ కేంద్రాలకు చేరుకుని అక్కడే రాత్రి వరకు ఉండి చదువుకుంటున్నారు.
గత ఆరేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నామని అభ్యర్థులు చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎస్జీటీ, ఎస్‌ఏ కలిపి మొత్తం 1095 ఖాళీలను మెగా డీఎస్సీలో భాగంగా భర్తీ చేయనున్నారు. వీటి కోసం భారీ సంఖ్యలో అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శిక్షణ కేంద్రాలన్నీ అభ్యర్థులతో రష్‌గా మారాయి.
ఈ డీఎస్సీలో కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జి, డీఎస్సీ పరీక్షకు సంబంధించిన మెటిరియల్‌ను చదువుతున్నామని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,050 (ఎస్సీ 3,050, ఎస్టీ 2 వేలు) మంది అభ్యర్థులకు ప్రైవేటు సంస్థలతో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం చక్కని అవకాశాన్ని ప్రకటించింది.
మెగా డీఎస్సీ పరీక్ష రాసేందుకు అర్హత పొందడానికి రాసిన టెట్ ఫలితాలు నవంబర్ 2న విడుదల కానున్నాయి. స్క్రీనింగ్ పరీక్షలో వచ్చే మార్కులను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేసి.. వారికి బోధన, వసతి, భోజన సదుపాయం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అధ్యయన కేంద్రాల్లో శిక్షణ ఇప్పించనున్నారు. ఒక్క కేంద్రంలో 150 మంది ఉంటారు. నవంబరు 5 నుంచి తరగతులు ప్రారంభించి డీఎస్సీ పరీక్ష తేదీలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రైవేటు కోచింగ్ సెంటర్లకెళ్లాలంటే వేల రూపాయలు ఖర్చువుతుందని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఉచిత బోధన, వసతి, భోజన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలకు వరం అని అంటున్నారు