Anakapalli Crime: అనకాపల్లి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. హిజ్రాతో సహజీనవం చేసే వ్యక్తి, గంజాయికి అలవాటు పడి మరో హిజ్రాతో సంబంధాన్ని కొనసాగించాడు. ఈ విషయం సహజీవనం చేసే హిజ్రాకు తెలిసి, అతన్ని నిలదీసింది. దీంతో ఆమెను హత్య చేసి, శరీర భాగాలను ముక్కలుముక్కలుగా కోసి బెడ్‌షీట్‌లో మూటగట్టి జాతీయ రహదారి వంతెన కిందపడేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనకాపల్లి జిల్లాలో మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లిలోని గవరపాలెంలోని ముత్రాసునాయకుల వీధికి చెందిన దిలీప్ కుమార్ నాలుగేళ్ల క్రితం ఆపరేషన్ చేయించుకుని హిజ్రాగా మారాడు. దిలీప్ కుమార్ దీపిక, దీపుగా పేరు మార్చుకున్నాడు.
కాకినాడకు చెందిన బన్నీ అనే డెలివరీ బాయ్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మునగపాక మండలం నాగులాపల్లిలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. బన్నీ గంజాయికి అలవాటు పడ్డాడు, అలాగే మరో హిజ్రాతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం సహజీవనం చేస్తున్న హిజ్రా దీపుకి తెలిసి బన్నీని నిలదీసింది.
ఈ క్రమంలో తరచూ ఇద్దరు మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో దీపును అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే మంగళవారం దీపుని మరో హిజ్రాతో కలిసి బన్నీ హత్య చేశాడు. అనంతరం శరీరం భాగాలను ముక్కలు ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. అనకాపల్లి జిల్లాలో సంచలనంగా మారిన ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కశింకోట మండలం బయ్యవరం వద్ద బెడ్‌షీట్‌లో మూటకట్టిన మహిళ శరీర భాగాలు స్వాధీనం చేసుకున్నారు.
వాటిని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం కుడిచేతిపై ఉన్న టాటూ, చేతికి బంగారు గాజులు, కుడితొడపై పుట్టుమచ్చ ఉన్నట్లు పోలీసులు ప్రకటన విడుదల చేశారు. వీటి ఆధారంగా నాగులాపల్లిలో ఉంటున్న దీపుగా అనుమానించి తోటి హిజ్రాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి దర్యాప్తులో ఆమె హిజ్రా దీపుగాని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు మరి కొన్ని శరీరభాగాలను బయ్యవరం-అనకాపల్లి నేషనల్ హైవేపై తాళ్లపాలెం వంతెన కింద పడేసినట్లు తెలిపాడు. దీంతో బుధవారం పోలీసులు అక్కడకు చేరుకుని శరీర భాగాలను సేకరించారు.
నిందితుడు బన్నీని ఎన్‌కౌంటర్ చేయాలంటూ హిజ్రాలు బుధవారం అనకాపల్లి జిల్లా ఆసుపత్రి, డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాడు. నిందితుడికి ఉరి శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని నినాదాలతో హోరెత్తించారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు డిమాండ్ చేశారు. మృతుడు దీపు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, డీఎస్పీ శ్రావణితో మాట్లాడారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం