Fate Of Ysrcp: పార్టీని వీడుతున్నవైసీపీ ముఖ్య నేతలు, పట్టించుకోని జగన్.. వెళ్లే వారిని వదిలేయాలని ఆదేశం
Fate Of Ysrcp: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీని వీడేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. అధికారం లేని చోట ఉండటం కంటే, అధికార పార్టీలో చేరిపోవడం సురక్షితం అనుకుంటున్నారు. కార్పొరేటర్లు మొదలుకుని ఎంపీల వరకు ఇదే బాటలో ఉన్నారు.వైసీపీ అధ్యక్షుడు మాత్రం వెళ్లే వారిని పట్టించుకోవట్లేదు.
Fate Of Ysrcp: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత వైసీపీ క్యాడర్‌లో ఆవరించిన స్తబ్దత నుంచి ఎవరి దారి వారు చూసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో సాధించిన గెలుపుతో రాజ్యసభ మొత్తం ఖాళీ అయిన పరిస్థితి నుంచి వేగంగా బయటపడేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకోవడంలో విజయం సాధించింది. నిన్న మొన్నటి వరకు లోక్‌సభలో బలం లేకపోయినా రాజ్యసభలో ఉన్న బలం తమకు ఉపయోగపడుతుందనుకున్న అంచనాలు తారు మారయ్యాయి.
ఐదేళ్ల క్రితం భారీ ఆధిక్యంతో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏక పక్ష నిర్ణయాలతో వైసీపీని నడిపించిన తీరు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కనీసం ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం కూడా లేకపోవడం, ప్రైవేట్ కంపెనీ తరహాలో పార్టీ వ్యవహారాలను నడిపించడంతో పర్యవసానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను పదవి నుంచి తప్పించి రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీకి పంపారు. తనకు ఢిల్లీ వెళ్లడం ఇష్టం లేదని మొత్తుకున్నా వినకుండా ఢిల్లీ పంపేశారు. జగన్ మాటకు ఎదురు చెప్పే ధైర్యం లేక, ఢిల్లీలో ఇమడలేకపోయిన మోపిదేవి ఆ పార్టీ అధికారానికి దూరమైన వెంటనే తన దారి తాను చూసుకున్నారు.
ఇక రాజ్యసభ పదవుల విషయంలో జగన్ అనుసరించిన విధానాలు ఎవరికి నచ్చకపోయినా అప్పట్లో ఎవరు కనీసం ప్రశ్నించే సాహసం చేయలేదు. అంబానీ సిఫార్సుతో పరిమళ్ నట్వానీకి, పార్టీ అధిష్టానాన్ని మెప్పించిన పారిశ్రామిక వేత్తలకు, సొంత సామాజిక వర్గానికి ఎంపీ పదవులు వరించాయి. ఇందులో సామాజిక సమతుల్యత పాటించలేదనే విమర్శల్ని కూడా ఏ మాత్రం ఖాతరు చేయలేదు. తన పార్టీలో తన నిర్ణయమే ఫైనల్ అన్నట్టు సాగింది.
ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడం, మరో ఐదేళ్ల పాటు అధికారం లేకుండా ఉండాలనే ఆలోచన చాలామంది నాయకుల్ని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. రకరకాల కారణాలతో జగన్ పార్టీలో ఉక్కపోతకు గురైన వాళ్లంతా తమ దారి తాము చూసుకోవాలనే భావనలో ఉన్నారు. మరోవైపు రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకోడానికి ఎన్డీఏ కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా తమకు దక్కే స్థానాల కోసం చకచకా పావులు కదుపుతోంది. వీలైనంత మందిని తమవైపు లాగేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. దీనిని ఆయన ఖండించారు.
ఇదంతా వ్యూహాత్మకంగానే జరిగినా వైసీపీలో గందరగోళం సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీని వీడుతున్న వారి విషయంలో జగన్ వైఖరి పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. పార్టీని వదిలే వారిని వదిలేయాలని ఉండే వారే ఉంటారని నేతలకు చెబుతున్నట్టు తెలుస్తోంది.
మరికాసేపట్లో రాజీనామాలు…
వైసీపీ ప్రాథమిక సభ్యత్వాలతో పాటు రాజ్యసభ సభ్యత్వాలకు ఇద్దరు ఎంపీలు నేడు రాజీనామా చేయనున్నారు. రాజ్యసభ చైర్మన్ అపాయింట్‌మెంట్ తీసుకున్న ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు.. మధ్యాహ్నం 12.30 గంటలకు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు. 2019వరకు పదవీ కాలం ఉన్నా పదవులకు రాజీనామా చేయాలనే నిర్ణయంతో ఢిల్లీ చేరుకున్నారు.
రెండేళ్లుగా వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని, వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బీదమస్తానరావు ఢిల్లీలో రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బీద మస్తానరావు తెలిపారు. కుటుంబసభ్యులు, మిత్రులతో చర్చించిన తర్వాత రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని చెప్పారు. తనకు సహకరించిన సహచర ఎంపీలు, వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
వైసీపీలో రెండేళ్లుగా తనకు సహకరించానని చెప్పారు. గెలుపొటములు ప్రజాస్వామ్యంలో సహజమని, 2019లో 151 సీట్లతో గెలిచిందని, 2024లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించిందని, గెలుపొటములు సహజమని బీద మస్తానరావు చెప్పారు. రాజీనామా తర్వాత కూడా బీద మస్తానరావును అదే స్థానంలో ఎంపీగా చేస్తారనే భరోసా లభించినట్టు తెలుస్తోంది.
రాజీనామా చేస్తున్న మరో ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ ఆసక్తి లేకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. స్థానిక ప్రజలను వీడి ఢిల్లీకి రావడం ఇష్టం లేదని ఆయన మొదటి నుంచి చెబుతున్నారు. మోపిదేవికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో మోపిదేవి, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరనున్నారు.