Anna Canteen Opening : అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం.. కత్తెర కోసం కొట్టుకున్న కూటమి నేతలు!
Anna Canteen Opening : ఏపీలో అక్కడక్కడా కూటమి నేతల మధ్య ఫైటింగ్ జరుగుతోంది. తాజాగా.. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేయడానికి నేతలు వచ్చారు. ఈ సమయంలో కత్తెర కోసం కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ సెటైర్లు వేస్తోంది.
రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో.. కూటమి నాయకుల మధ్య ఫైటింగ్ జరిగింది. అన్న క్యాంటీన్ రిబ్బన్ కటింగ్ కోసం కూటమి నాయకులు కొట్టుకున్నారు. రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ తానంటే తానని అని సుగవాసి బాలసుబ్రమణ్యం, చమర్తి జగన్మోహన్ రాజు ఎవరికి వారు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో.. అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవ పడ్డారు. ఒకరు కత్తెర తీసుకొని రిబ్బన్ కట్ చేయబోగా.. మరొకరు దాన్ని లాక్కున్నారు. ఈ సమయంలో వివాదం జరిగింది.
ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 75 అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గురువారం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించి ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 175 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని చంద్రబాబు చెప్పారు.
గతంలో ఉన్న 203 క్యాంటీన్లను పూర్తిగా పునరుద్దరిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పట్టణాల్లో అయితే అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించి అక్కడ ఉన్న కొంత మంది మహిళలు, ఆటో డ్రైవర్లతో కొద్దిసేపు మాట్లాడారు.
అన్నా కాంటీన్ ద్వారా అందిస్తున్న అన్నం ఇతర వంటకాలు ఏవిధంగా ఉన్నాయని చంద్రబాబు ఆరాతీశారు. భోజనం చాలా బాగుందని 5 రూపాయలకే మంచి ఆహారాన్ని అందించడం పట్ల వారు చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. కేవలం 5 రూపయలకే రుచికరమైన, పౌష్ఠి కాహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో అందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఎక్కడా ఈవిధంగా లేదన్నారు.
గత ఐదేళ్లలో అన్నా క్యాంటీన్లు లేక భోజనం కోసం అనేక ఇబ్బందులు పడ్డామని పలువురు మహిళలు, ఆటో డ్రైవర్లు చంద్రబాబుకు వివరించారు. పేదవాడి ఆకలి దప్పులు తీర్చేందుకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్నా క్యాంటీన్లను.. గత ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. అతి త్వరలో అన్ని అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.