Jagan Assets Case: జగన్ ఆస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి, మరో బెంచ్ ముందుకు కేసు విచారణ
Jagan Assets Case: జగన్ ఆస్తుల కేసు విచారణలో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ బాధ్యతల నుంచి సీజే బెంచ్‌లోని న్యాయమూర్తి తప్పుకున్నారు. కేసు తదుపరి విచారణ డిసెంబర్‌లో జరుగనుంది.
Jagan Assets Case: జగన్‌పై నమోదైన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం జరిగింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం నుంచి మరో బెంచ్ పిటిషన్ విచారణ మార్పు జరిగింది. జగన్‌పై నమోదైన క్విడ్ ప్రో కో కేసుల్లో దాదాపు 12ఏళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నారని, విచారణ జరగకుండా రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని, జగన్‌కు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు.
జగన్‌పై నమోదైన కేసుల విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని పిటిషన్ వేశారు. రఘరామ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్ల నేడు సీజే బెంచ్ ఎదుట విచారణకు వచ్చాయి. రఘురామ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నాతోపాటు ధర్మాసనంలో జస్టిస్ సంజయ్‌కుమార్ ఉన్నారు. కేసుల విచారణ ప్రారంభం కాగానే పిటిషన్ ఏపీకి చెందినవిగా జగన్ తరఫు లాయర్ బెంచ్‌కి వివరించారు.
సుదీర్ఘ కాలంగా విచారణ కొనసాగుతుండటంతో పాటు తాజా పరిణామాల నేపథ్యంలో కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని సీబీఐ కోరింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయడానికి కు కొంత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.
అదే సమయంలో పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పిటిషన్లను 'నాట్ బిఫోర్' గా ప్రకటించడంతో వాటిని మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. రఘురామ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మరో ధర్మాసనానికి బదిలీ చేశారు.సుప్రీం కోర్టులో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వం వహించే ధర్మాసనం ముందుకు డిసెంబర్ 2న విచారణకు పంపాలని సీజే రిజిస్ట్రీని ఆదేశించారు.