Sachivalaya Police: మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులపై త్వరలో స్పష్టత ఇస్తామన్న హోంమంత్రి
Sachivalaya Police: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులు,మహిళా పోలీసుల విధులపై అసెంబ్లీలో చర్చ జరిగింది.జాబ్ ఛార్ట్, సర్వీస్ రూల్స్ లేకపోవడాన్ని సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించడంతో మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులపై స్పష్టత ఇస్తామని హోంమంత్రి ప్రకటించారు
Sachivalaya Police: మహిళా సంరక్షణ కార్యదర్శలు విధులు, జాబ్ చార్టులపై త్వరలోనే సంబంధిత శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. ఈ అంశంపై సభ్యులు తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
గ్రామ సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శుల విధుల గురించి క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గౌరు చరితారెడ్డి, మాధవిరెడ్డి కోరారు. వారి ప్రశ్నలకు అసెంబ్లీలో హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో యాక్టులు కూడా చదవకుండా జీవోలు ఇష్యూ చేసిందని అనిత్ విమర్శించారు.
2019లో రిక్రూట్ మెంట్ సమయంలో మహిళా పోలీసులుగా ఎలాంటి ట్రైనింగ్, పరీక్షలు లేకుండా నియామకం చేశారని, సుమారు 15 వేల మందిని రిక్రూట్ చేసుకుంటే.. అందులో 13,815 మంది పనిచేస్తున్నారని.. మరో 1,189 ఖాళీలు ఉన్నాయని సభకు తెలిపారు. 2021లో మరో జీవో తెచ్చి.. వారిని మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మార్చారన్నారు.
మహిళా సంరక్షణ కార్యదర్శులకు సుమారు 6 శాఖలతో కలిపి.. జాబ్ చార్ట్ ఇచ్చారని తెలిపారు. చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో.. అన్ని బాధ్యతలు వీరికి ఇచ్చారని అనిత విమర్శించారు. జగన్ ప్రభుత్వం అవివేకానికి ఇది నిదర్శనం అన్నారు.
పోలీస్ శాఖలో ఉద్యోగాలు అంటే దేహధారుడ్య పరీక్షలు, రాత పరీక్షలతో పాటు ట్రైనింగ్ కూడా ఉంటుందని..కేవలం 2 వారాల ట్రైనింగ్ తో పోలీసులుగా మార్చే ప్రయత్నం చేశారన్నారు. కేవలం పోలీస్ శాఖలో 15 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని చెప్పుకొనేందుకు చేసిన వృథా ప్రయత్నమని విమర్శించారు. దీంతో పాటు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఇష్టం లేకుండానే పోలీస్ యూనిఫామ్ వేయించాలానే ప్రయత్నం చేశారన్నారు.
యూనిఫామ్స్, జాబ్ ఛార్టులపై కోర్టుల్లో 7 రిట్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వానికి జాబ్ చార్టులపై కనీస అవగాహన లేదని విమర్శించారు. అందుకే మహిళా సంరక్షణ కార్యదర్శులు రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి, అడ్మిన్ రైట్స్ పోలీస్ శాఖలు, జీతాలు, సెలవులు ఇచ్చేది ఎంపీడీవోలు అని చెప్పారు. ఇన్ని శాఖలతో సంబంధం వల్ల మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గత ప్రభుత్వం ఎస్కార్ట్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలతో పాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఉపయోగించుకుందన్నారు. గత ప్రభుత్వ అవివేకం వల్ల ఎన్నో ఇబ్బందులు పడిన మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో చర్చ జరగాలన్నారు. వారిని ఏ శాఖకు కేటాయించాలి అన్న అంశంపై సభ్యులు తమ సలహాలు, సూచనలు లిఖిత పూర్వకంగా అందజేయాలని కోరారు. సంబంధిత శాఖలతో చర్చ జరిపి అతి త్వరలోనే మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులపై శాశ్వత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.