Annamayya District : ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్... కుటుంబం సజీవ దహనం!
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబం సజీవ దహనమైంది. మొత్తం ముగ్గురు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కావాలనే చేశారా..?అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి కుటుంబమే సజీవ దహనమైంది. తల్లి, కుమారుడు, కుమార్తె ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలు విన్నంటాయి.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని తొగటవీధిలో లక్కిరెడ్డిపల్లె మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన రాజ, రమాదేవి కుటుంబం నివాసం ఉంటుంది. అయితే రాజ జీవనాధారం కోసం కువైట్‌లో ఉంటున్నాడు. అక్కడ పని చేసుకుంటూ కుటుంబానికి డబ్బులు పంపిచేవాడు. అయితే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
తెల్లవారుజామున ఘటన…
శనివారం తెల్లవారుజామున వీరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. ఇంట్లో ఉన్న ముగ్గురు సజీవ దహనం అయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో వచ్చిన మంటలు తల్లి, కుమారుడు, కుమార్తెలకు అంటుకుని అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి రమాదేవి (34), కుమారుడు మనోహర్ (9), కుమార్తె మన్విత (5) చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ నరసింహారెడ్డి నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు… వాటిని పరిశీలిస్తున్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు.
రాయచోటి డీఎస్సీ రామచంద్రయ్య ఘటనాస్థలిని పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఏవరైనా కావాలనే చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విచారణ కూడా ఆ రకంగానే జరుగుతోందని తెలిపారు.
భార్య భర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతున్నట్లు స్థానికులు తమకు చెప్పారని డీఎస్పీ రామచంద్రయ్య తెలిపారు. ఆ గొడవలే ఈ ఘటనకు దారి తీశాయా? అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిజనిజాలు తెలుసుకుంటామని డీఎస్పీ రామచంద్రయ్య తెలిపారు.