పేదల పెద్ద కొడుకు రాజన్న లేక పద్నాలుగేళ్లు-the fourteen year anniversary of ysr death a time to remember and mourn ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  The Fourteen-year Anniversary Of Ysr Death A Time To Remember And Mourn

పేదల పెద్ద కొడుకు రాజన్న లేక పద్నాలుగేళ్లు

పేదల పెద్ద కొడుకు వైఎస్సార్
పేదల పెద్ద కొడుకు వైఎస్సార్ (https://www.facebook.com/ysrcpofficial)

‘వైఎస్సార్‌’ అన్న మాట వింటేనే తెలుగు ప్రజల మనస్సుల్లో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. తెల్లని పంచకట్టుతో నిలువెత్తు మనిషి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆయన మాట మన చెవిన పడితే మంత్రంలా ఉంటుంది.

పేదల పెద్దకొడుకు వైఎస్సార్ వెళ్లిపోయి రేపటికి పద్నాలుగేళ్లు. ‘వైఎస్సార్‌’ అన్న పేరు వినగానే తెల్లని పంచకట్టుతో, చిక్కటి చిరునవ్వుతో నిలువెత్తు మనిషి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆయన మాట మన చెవిన పడితే మంత్రంలా ఉంటుంది. కుటుంబ అవసరాలు తెలిసిన తండ్రిలా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో దాగిన మానవీయ కోణం ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచియేలా చేసింది.

ట్రెండింగ్ వార్తలు

చిన్నారులు, మహిళలు, వృద్ధులు, రైతులు, విద్యార్థులు, బడుగువర్గాల వారు, ఉద్యోగులు.. ఒకటేమిటి అన్ని రంగాల వారు వైఎస్సాఆర్‌ పాలనలో అలా ఉండేది.. అని ఆ మంచి రోజులను 14 ఏళ్ల తర్వాత కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికీ తెలుగు రాజకీయాల్లో ఆయన ప్రస్తావన లేని రోజు ఉండదని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఆయన చిరునవ్వు కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటుంది.

ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ, వారిని కలుసుకుంటూ ఉండడంతో ఆయనకు ప్రజల కష్టాలపై మరీ ముఖ్యంగా పేదల కష్టాలపై అవగాహన ఉంది. వారికి తోడ్పాటు అందించడానికి అధికారంలోకి వచ్చాక తీసుకోవాల్సిన చర్యలపై ఆయనకు ఒక దృఢమైన అభిప్రాయం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే ఏర్పడింది.

పేదల పెద్ద కొడుకుగా

తెలుగు మహిళలు రాజశేఖరరెడ్డిని ఒక పెద్దకొడుకుగా, ఒక అన్నగా, ఒక మేనమామగా చూసుకున్నారు. ఆయనలో మహిళల పట్ల సెంటిమెంట్‌ ఎక్కువగా ఉండేది. చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుండి ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ప్రారంభించి మరో చెల్లెమ్మ గౌరు చరితారెడ్డి నియోజకర్గం నందికొట్కూరులో ముగించారు.

పాదయాత్ర అనంతరం ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన వైఎస్‌ఆర్‌ తన మంత్రి వర్గంలో సబితా ఇంద్రారెడ్డికి హోం మంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. ఒక మహిళకు హోం మంత్రిత్వ శాఖ ఇవ్వడం అదే మొదటిసారి. ప్రభుత్వంలో కీలకమైన హోం శాఖను ఒక మహిళ నిర్వహించలేరనే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ వైఎస్‌ఆర్‌ సబితా ఇంద్రారెడ్డి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తారని నిరూపించారు. ఆయన మహిళా సంక్షేమం పట్ల అవిశ్రాంతంగా శ్రమించారు. పావలావడ్డీ, అభయహస్తం పథకాలను ప్రవేశపెట్టి ఆడపడుచులు ఆర్థికంగా స్థిరపడడానికి కృషి చేశారు. పేదవారి సొంతిటి కల నెరవేరేలా ‘ఇందిరమ్మ ఇళ్లు’ అందజేశారు. ఇప్పటికీ ఆ ఇళ్లల్లో సేదతీరుతున్న ఆడపడుచులు రాజశేఖర్‌రెడ్డి చలువతోటే చల్లంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. పావలా వడ్డీ పథకాన్ని తొలుతగా స్వయం సహాయక సంఘాల మహిళలకే అమలు చేసిన, దాంతో కలుగుతున్న ప్రయోజనాలను గుర్తించి ఈ తర్వాత రైతులతో పాటు వివిధ వర్గాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందేలా చేశారు. ప్రతి మహిళను లక్షాధికారి చేయాలనేదే రాజన్న లక్ష్యంగా ఉండేది.

మహిళలు ఆర్థికంగా బలపడడమే కాకుండా వారి ఇంటి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంగా రాజశేఖరరెడ్డి నిరుపేదలకు రూ. 2లకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒక పేదింటి బిడ్డ ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబం దశ తిరుగుతుందని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. అందుకు అనుగుణంగా పేదింటి విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలని కంకణం కట్టుకొని ఆయన ప్రవేశపెట్టిన ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ పథకం ఒక విప్లవాత్మకంగా పేద బతుకులను మార్చింది. దీంతో పేదింటి బిడ్డలు తామూ కూడా ఒక ఇంజినీర్‌గా, ఒక డాక్టర్‌గా కావాలన్న తమ కలలను సాకారం చేసుకున్నారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ, పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందుబాటులోకి వచ్చాయి.

దేశానికే ఆదర్శంగా

వృత్తిరీత్య వైద్యుడైన రాజశేఖరరెడ్డి కడపలో ‘రూపాయి డాక్డర్‌’గా గుర్తింపు పొందారు. వైద్యుడైన రాజన్న ప్రతి ఇంటిని పట్టి పీడించే అనారోగ్య సమస్యకు చికిత్స చేకూర్చారు. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్స చేయించారు. ‘ఆరోగ్య శ్రీ’ పథకంతో పేదలు కూడా కార్పొరేట్‌ వైద్యం పొందగలిగారంటే అది రాజన్న చలవే. ఆపద సమయంలో ఆదుకునేలా ‘108’, ‘104’ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టి దేశానికే మార్గదర్శకంగా నిలిచారు. రాజశేఖరరెడ్డి వృద్ధులకు, మహిళలకు, పేదలకు సహాయంగా ఉండేలా అనేక రంగాలలో ఆసరా పింఛన్లు ప్రవేశపెట్టారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు నెలనెలా పింఛన్లు అందించారు. ఎలాంటి ఆసరా లేకుండా దిక్కుతోచని జీవితాలు గడుపుతున్న వీరికి మాకోసం ఒకరున్నారనే భరోసా కల్పించారు రాజన్న.

రైతును రాజును చేసిన రాజన్న

ప్రతిపక్ష నేతగా రాష్ట్ర వ్యాప్తంగా 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాజశేఖరరెడ్డి అప్పటి కరువు కాటకాలను చూసి చలించిపోయారు. అన్నదాతల అష్టకష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని గట్టిగా నమ్మే రాజన్న రైతు ముఖాన చిరునవ్వుకు అనేక పథకాలను తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై, విద్యుత్‌ బాకాయిల మాఫీపై తొలిసంతకం చేసి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసాన్ని కలిగించారు. ఉచిత విద్యుత్‌పై సొంత పార్టీలో కూడా కొంత వ్యతిరేకత ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. వ్యవసాయం పనులు లేని సమయాల్లో రైతు కూలీలకు జీవనోపాధి ఉండేలా ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. వ్యవసాయమంటేనే చెవి కోసుకునే రాజన్నకు రైతులు, చేను, మొక్క, చెట్టు, మట్టి, గ్రామీణం ఇష్టమైన పదాలని ఆయనతో సన్నిహితంగా ఉండేవారు చెబుతుండేవారు.

వ్యవసాయానికి కీలకమైన నీటివనరుల కోసం ఆయన ప్రారంభించిన జలయజ్ఞంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. ఈ ప్రాజెక్టులతో వెనుకబడిన ప్రాంతాలలోని బీడు భూములు పచ్చగా మారేలా నీటిని పారించారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటికి ప్రాజెక్టులతో అడ్డుకట్టవేసి అపరభగీరథుడిగా నిలిచారు.‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని సాధకబాధకాలు తెలసుకోవడానికి ప్రజల వద్దకు వెళ్లారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని వాటిని అమలుపరిచే ‘చేతల మనిషి’గా నిలిచారు.

రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదైన వ్యక్తులలో ముందువరుసలో ఉండే వారిలో వైఎస్‌ఆర్‌ ఒకరు. పులివెందుల నియోజకవర్గం నుండి 1978, 1983, 1985 ఎన్నికల్లో అసెంబ్లీకి, కడప లోక్‌సభ స్థానం నుండి 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో పార్లమెంట్‌కి, ఆ తర్వాత మరోసారి పులివెందుల నుండి 1999, 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేసి వరుసగా వైఎస్‌ రాజశేశరరెడ్డి విజయాలు సాధించారు. ఎదురులేని విజయాలతో ప్రజల మనసులలో నిలిచిపోయిన డా.వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని మళ్ళీ చూడగలమా! అనే భావన ప్రతీ ఒక్కరిలో ఉంది.

ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఆదర్శనీయమే. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా తెల్లవారుజామునే నిద్రలేవడం, ఎవరు ఏ సహాయం కోరి ఇంటికొస్తే తన హోదాను పక్కనపెట్టి వారి అవసరం తెలుసుకొని సాయపడేవారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నిర్విరామంగా కొనసాగుతూ ఆదరణీయంగా ఉన్నాయంటే ఆయన దూరదృష్టి, ప్రజా సంక్షేమమే కారణాలు. ఈ పథకాలు తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర దేశాల్లోని అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రజల కష్టాలను తీర్చి వారి జీవన స్థితి బాగోగుల కోసం పాలకుడిలో ఉండాల్సిన స్పష్టత, చిత్తశుద్ధి, దూరదృష్టి, దార్శనికత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిలో ఉండడంతో ఆయన తెలుగునాట చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.

- జి. శ్రీలక్ష్మి,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

జి. శ్రీలక్ష్మి, రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ
జి. శ్రీలక్ష్మి, రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ
WhatsApp channel