Krishna River Floods : విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్.. నెమ్మదిగా శాంతిస్తున్న కృష్ణమ్మ
Krishna River Floods : విజయవాడ నగరం వరదలతో వణికిపోతోంది. ఈ సమయంలో కాస్త రిలీఫ్ ఇచ్చే విషయం చెప్పారు అధికారులు. విజయవాడ పరిసరాల్లో కృష్ణా నది వరదలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. సాయంత్రం వరకు ఇంకా తగ్గే అవకాశం ఉంది.
విజయవాడలో కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తుంది. ప్రకాశం బ్యారేజీకి సోమవారం ఇన్‌ఫ్లో 11 లక్షల క్యూసెక్కులు ఉండగా.. మంగళవారానికి అది 9 లక్షల క్కూసెక్కులకు తగ్గింది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాయంత్రానికి వరద ఇంకాస్త తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు విజయవాడ నగరంలోనూ వరద నీరు క్రమంగా తగ్గుతోంది. మంగళవారం సాయంత్రానికి చాలాచోట్ల సాధారణ పరిస్థితికి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.
సింగ్ నగర్‌లో కష్టాలు..
విజయవాడ సింగ్ నగర్‌లో వరద కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. నిత్యావసరాలు, మంచి నీరు తీసుకెళ్తున్నారు. నాలుగు అడుగుల లోతు నీటిలో కాలనీల నుంచి బయటకు వస్తున్నారు. వరద తగ్గని ప్రదేశాల్లో హెలీకాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు.
సినీ ప్రముఖుల విరాళాలు..
తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ. 25 లక్షలు విరాళం అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విశ్వక్‌సేన్ విరాళం ఇచ్చారు.
సింహాచలం నుంచి పులిహోర ప్రసాదం..
విజయవాడ వరద బాధితులకు సింహచలం నుంచి పులిహోర ప్రసాదం తీసుకొస్తున్నారు. 20 వేల పులిహోర ప్యాకెట్లు విజయవాడకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. రైలులో 10 వేల ప్యాకెట్లను ఆలయ అధికారులు పంపారు. మధ్యాహ్నం మరో 10 వేల పులిహోర ప్యాకెట్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడకు 10 వేల పులిహోర ప్యాకెట్లు చేరాయి.
క్రమంగా పెరుగుతున్న వాహనాలు..
విజయవాడ -హైదరాబాద్ హైవేపై వాహనాల రాకపోకలు క్రమంగా ప్రారంభం అవుతున్నాయి. సోమవారం రాత్రి వరకూ మాచర్ల మీదుగా వెళ్లిన బస్సులు.. ఇప్పుడు నందిగామ మీదుగా ప్రయాణం చేస్తున్నాయి. వంతెన గండి పడటంతో సింగిల్ రూట్‌లో వెళుతున్నాయి. సర్వీసుల పునరుద్ధరణతో హైదరాబాదు ప్రయాణానికి ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. అయితే.. డ్రైవర్లు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ముంపు ప్రాంతాల్లోకి ట్రాక్టర్లు.. క్రేన్లు..
విజయవాడలో వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వందకు పైగా ట్రాక్టర్లను ముంపు ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ క్రేన్లు కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లోకి బోట్లు, ట్రాక్టర్లు, క్రేన్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. అందుకే అధికారులు వీటిని సిద్ధం చేసి.. ముంపు ప్రాంతాలకు పంపిస్తున్నారు.