AP Rain Alert : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ నెల 27, 28 తేదీల్లో భారీ వర్షాలు
AP Rain Alert : ఏపీలో ఈనెల 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. అటు ఉత్తరాంధ్రలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.
నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తర్వాత 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అరకులో 8.9డిగ్రీలు,డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మన్యంలోని 11 మండలాల్లో చలి అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8డిగ్రీల కంటే కనిష్టానికి తగ్గాయి. తెలంగాణలో సైతం చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో పగటి సమయంలో కూడా మంచుతెరలు వీడటం లేదు.
గతంతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత అధికం అయ్యింది. సోమవారం రాత్రి అరకులోయలో 8.9డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7డిగ్రీలు, జి.మాడుగులలో 10డిగ్రీలు, ముంచంగిపుట్టు, హుకుంపేటలో 10.9డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తక్కువ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్‌లో 12.4, బీహెచ్‌ఈఎల్‌లో 12.8 ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నం శివార్లలో 11.4 నమోదైంది. ఉత్తర, దక్షిణ హైదరాబాద్ ఏరియాల్లో 13 నుంచి 15 డిగ్రీలో ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి.
అటు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని చాలాచోట్ల 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.