AP Land Registrations: ప్రజల్లో ఆగ్రహంతో ఏపీలో భూముల ధరల పెంపు నిర్ణయం వాయిదా… ప్రస్తుతానికి లేనట్టే…-the decision to increase land prices in ap has been postponed due to public anger ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Land Registrations: ప్రజల్లో ఆగ్రహంతో ఏపీలో భూముల ధరల పెంపు నిర్ణయం వాయిదా… ప్రస్తుతానికి లేనట్టే…

AP Land Registrations: ప్రజల్లో ఆగ్రహంతో ఏపీలో భూముల ధరల పెంపు నిర్ణయం వాయిదా… ప్రస్తుతానికి లేనట్టే…

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 27, 2024 09:57 AM IST

AP Land Registrations: ఏపీలో భూముల మార్కెట్‌ విలువ పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జనవరి 1 నుంచి ఏపీలో మార్కెట‌్ ధరల్ని సవరించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది.ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం,ఇప్పటికే రియల్‌ ఎస్టేట్ తిరోగమనంలో ఉండటంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది.

ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదలపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదలపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

AP Land Registrations: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 1 నుంచి భూముల మార్కెట్‌ ధరలు పెంచాలనే నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. భూముల ధరల పెంపుదలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం కావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. 2025 జనవరి 1 నుంచి భూముల మార్కెట్‌ ధరలను పెంచాలనే యోచన తాత్కలికంగా విరమించుకుంది. దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం తర్వాత ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదలపై ప్రజల్లో నెలకొన్న ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను హెచ్‌టి తెలుగు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది.

yearly horoscope entry point

ఆంధ్రప్రదేశ్‌లో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఆదాయన్ని పెంచుకోవాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. 2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల కొత్త ధరల్ని ప్రతిపాదించి ప్రజాభిప్రాయం సేకరించాలని రెవిన్యూ శాఖ ఆదేశించింది.

రాష్ట్ర వ్యాప్తంగా భూములకు ఉన్న డిమాండ్‌ను, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని రెండు వారాల క్రితమే ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ నిర్ణయంపై ప్రజలతో పాటు ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సూచనలతో మార్కెట్ ధరల పెంపు నిర్ణయంపై వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది.భూముల ధరల పెంపుదలపై ప్రజా ప్రతినిధుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తోంది.

గత ఐదేళ్లలో పలుమార్లు భూముల మార్కెట్‌ రిజిస్ట్రేషన్‌ ధరలను పెంచారు. దీని వల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడింది. పట్టణాలు, నగరాల్లో మార్కెట్ ధరలకు సమానంగా ప్రభుత్వ రిజస్ట్రేషన్ ధరలు చేరుకున్నాయి. అప్పట్లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదలను టీడీపీ వ్యతిరేకించింది. మరోవైపు ధరల పెరుగుదలతో ఏపీలో రియల్ ఎస్టేట్ కుదేలైంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదాయన్ని పెంచుకోడానికి భూముల రిజిస్ట్రేషన్ల ఛార్జీలను పెంచాలని కొందరు ప్రతిపాదించారు. ఆదాయం కోసం 14వేల కోట్ల రుపాయలు ఆర్జించేలా రెవెన్యూ శాఖలో ప్రతిపాదనలు చేశారు. ఈ ఆదాయంపైనే ఆర్థికశాఖ ఆశలు పెట్టుకుంది. భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా 14వేల కోట్ల ఆదాయం వస్తుందని అందుకు అనుమతించాలని ఆర్థికశాఖ, రెవెన్యూశాఖల అధికారులు ముఖ్యమంత్రి వద్ద పట్టుబట్టారు. ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించింది.

ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో కలకలం రేగింది. ఇప్పటికే భూములు, అపార్ట్‌మెంట్ల అమ్మకం గణనీయంగా పడిపోయింది. 2025 జనవరి 1 నుంచే భూముల మార్కెట్‌ ధరలు పెంచాలనే నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ అంశంపై సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుందామని, జనవరి 1 నుంచి భూముల మార్కెట్‌ ధరల పెంపు నిర్ణయం అమలును వాయిదా వేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆదేశాలు గురువారం ఇచ్చారు. ఈనెల 30న మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జోనల్‌ రెవెన్యూ సమావేశం జరగనుంది. అదేరోజు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టత ఇచ్చారు.

ఏపీలో కుదేలైన రియల్ ఎస్టేట్..

మూలిగే నక్క మీద తాటికాయలా అసలే అంతంత మాత్రంగా ఉంటోన్న ఏపీ రియల్ ఎస్టేట్‌ లావాదేవీలపై మరో భారం పడనుంది. 1నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. వైసీపీ హయంలో 2022లో రిజిస్ట్రేషన్‌ విలువలను భారీగా పెంచేశారు. మార్కెట్‌ విలువకు, బహిరంగ మార్కెట్‌ ధరలకు పెద్దగా వ్యత్యాసం లేనంతగా ఈ ధరలు చేరుకున్నాయి.దీంతో గత రెండున్నరేళ్లుగా రియల్ ఎస్టేట్‌ లావాదేవీలు తగ్గిపోయాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయాన్ని ఆర్జించే శాఖల విషయంలో గత ప్రభుత్వ బాటలోనే సాగుతోంది. రిజిస్ట్రేషన్ విలువల సవరణ కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లా శాఖల నుంచి ప్రతిపాదనలు సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ విలువ పెంచాలని శాఖాపరమైన సమావేశాల్లో ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాజా నిర్ణయంతో ఈ ఏడాది డిసెంబర్‌లోగా రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వ నిర్ణయంతో జనవరి 1వ తేదీ నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమ ల్లోకి రాబోతున్నాయి.ఈ దఫా పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఇతర అంశాల ప్రాతిపదికగా ప్రసుత్తం ఉన్న దానిపై 10% నుంచి 15% వరకు విలువలు పెరిగే అవకాశం ఉంది.

పెద్ద తేడా ఏమి లేదు..

సాధారణంగా ప్రభుత్వ లెక్కల్లో ఉండే భూమి విలువకు బహిరంగ మార్కెట్‌లో ఉండే విలువకు వ్యత్యాసం ఉంటుంది. ఈ విధానంలో భూమి కొనుగోలు చేసే వారికి తక్కువ ధరకు నివాస భూమి లభించడంతో పాటు అమ్మే వారికి లాభసాటిగా ఉండేది. ఈ విధానంలో ఆదాయాన్ని కోల్పోతున్నామని గుర్తించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచుకుంటూ పోతోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి బహిరంగ మార్కెట్‌ విలువలతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వాలు పెంచుకుంటూ వచ్చాయి. దీని వల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య మాటెలా ఉన్నా ప్రభుత్వానికి మాత్రం భారీగా ఆదాయం సమకూరింది.

అపార్ట్‌మెంట్‌లకైతే భూమి విలువతో పాటు చదరపు అడుగుల్లో నిర్మాణ విలువను కూడా లెక్కిస్తారు. ఈ విధానంలో ఫ్లాట్ల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. అన్‌డివైడెడ్‌ షేర్‌లో కొనుగోలు దారుడికి లభించే వాటాతో పాటు నిర్మాణం జరిగిన భూమికి కూడా రిజిస్ట్రేషన్‌ ఫీజును చెల్లించాలి. ఉదాహరణకు విజయవాడలో 2వేల చదరపు అడుగుల ఫ్లాట్‌కు ప్రభుత్వ లెక్కల్లో రూ.75లక్షల నుంచి కోటి రుపాయల ఖరీదు చేస్తే అందులో దాదాపు రూ.6 నుంచి రూ.10 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో సదరు ఫ్లాట్ విలువ కోటి నుంచి కోటిన్నర వరకు ఉండొచ్చు.

సౌకర్యాలతో సంబంధం లేకుండా ధరలు…

మౌలిక సదుపాయాలు, అభివృద్ధితో సంబంధం లేకుండా ఎడాపెడా ధరలను ఖరారు చేసే విధానాలు రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. దీని వల్ల ఏపీలో రియల్‌ ఎస్టేట్ మార్కెట్‌లు డీలా పడుతున్నాయి. జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో భూముల ధరల్ని ఖరారు చేసేలా మార్గదర్శకాలు జారీ చేశారు.

విలువల సవరణ ప్రతిపాదనలకు జిల్లా కమిటీల ఆమోదం తెలిపిన తర్వాత ఈ నెల 20న సబ్-రిజి స్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో కొత్త ధరల ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 24వ వరకు అభ్యంతరాలు/సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. అభ్యంతరాల పరిశీలన ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతుంది.

2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్లను ఆదేశిస్తూ రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకా లకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. తాజా నిర్ణయంతో ప్రస్తుత ధరలపై 10 నుంచి 15శాతం వరకు ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం