Amaravati Capital: ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది సరే అమరావతి ఇక పదిలమేనా? వివాదాలకు ముగింపు ఎప్పటికి?-the deadline for joint capital is over is amaravati still tenable when is the end of disputes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Capital: ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది సరే అమరావతి ఇక పదిలమేనా? వివాదాలకు ముగింపు ఎప్పటికి?

Amaravati Capital: ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది సరే అమరావతి ఇక పదిలమేనా? వివాదాలకు ముగింపు ఎప్పటికి?

Bolleddu Sarath Chandra HT Telugu
Published Aug 26, 2024 07:17 AM IST

Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైంది. విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి రాజధాని గడువు తీరిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలు కావొస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని పదిలం చేసే ప్రయత్నాలు ఏవి ఇంకా మొదలు కాలేదు.

ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు

Amaravati Capital: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన జరిగిన పదేళ్లు దాటిన తర్వాత కూడా ఏపీ రాజధానిపై నెలకొన్న సందేహాలు ఇంకా నివృత్తి కాలేదు. రాజు మారిన ప్రతిసారి రాజధాని మారుతుందన్నట్టు ఏపీ పరిస్థితి తయారైంది. సమాఖ్య వ్యవస్థలో భాగంగా రాజధాని నగరాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, అధికారాన్ని భారత రాజ్యాంగం రాష్ట్రాలకే కట్టబెట్టడంతో భౌగోళిక హద్దుల్ని మాత్రమే పార్లమెంటు చేసిన చట్టంలో పేర్కొంది.

2015లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిఆర్‌డిఏ చట్టాన్ని రూపొందించినా అమరావతిని ఏపీ రాజధానిగా నోటిఫై చేయలేదు. 2020 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరాన్ని ధృవీకరిస్తూ కేంద్రం జారీ చేసిన ఎలాంటి ధృవీకరణలు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ దరఖాస్తుకు సమాచారం ఇచ్చింది.

అమరావతి చుట్టూ అవరోధాలు…

2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అదే ఏడాది చివరిలో గుంటూరు-విజయవాడ మధ్య కృష్ణా తీరంలో ఉన్న ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2015 జనవరిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభించి రాజధాని కోసం భూ సమీకరణ ప్రారంభించారు. భూసేకరణ, ప్రభుత్వ భూములు, రైతుల నుంచి సమీకరించిన భూములతో కలిపి దాదాపు 51వేల ఎకరాల విస్తీర్ణంలో అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. 2019నాటికి దాదాపు రూ.10వేల కోట్ల రుపాయలను అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది.

2019జూన్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అమరావతిని తొలగించారు. రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థను అమరావతి ప్రాంతానికి పరిమితం చేశారు. ఈ మేరకు అమరావతి పరిధి, విస్తృతిని కుదిస్తూ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో చట్ట సవరణలు చేసింది.

అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా కాకుండా పరిపాలన రాజధానిని విశాఖపట్నంకు, శాసన వ్యవస్థను అమరావతికి, న్యాయవ్యవస్థను కర్నూలుకు మారుస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై దాదాపు మూడేళ్ల పాటు రకరకాల వివాదాలు, న్యాయపోరాటాలు జరిగాయి. చివరకు ఏపీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయపరమైన వివాదాలను కొలిక్కి తెచ్చేందుకు 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది.

మరోవైపు అమరావతి వ్యవహారంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం ఇప్పటికీ సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. ఈ వివాదాన్ని ముగించేందుకు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఇంకా మొదలుపెట్టలేదు.

ఏపీలో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు సమీపిస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతల్లో అసెంబ్లీ సమావేశాలు, నాలుగు సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. వీటిలో అమరావతి అంశం తెరపైకి రాలేదు. 2024 జూన్‌2తో ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోయింది. అమరావతి భౌగోళిక పరిధిని పూర్వపు స్థితికి తీసుకు వచ్చే ప్రక్రియ కూడా జరగలేదు.

ఉమ్మడి రాజధాని గడువు ముగిసేలోపు సెక్షన్ 9,10 ఆస్తుల విభజన కొలిక్కి తీసుకురావాల్సి ఉన్నా అది పూర్తి కాకుండానే ఉమ్మడి గడువు ముగిసిపోయింది. ఉమ్మడి ఆస్తుల వ్యవహారంపై రెండు సార్లు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిగినా అర్థవంతమైన పరిష్కారం మాత్రం లభించలేదు. ఈ అంశంపై కూడా పదేళ్లుగా కేంద్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.

రాజధాని నిర్ణ‍యం రాష్ట్రానిదే…

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని పలు సందర్భాల్లో బీజేపీ పెద్దలు ప్రకటించారు. భారత రాజ్యాంగం ద్వారా రాష్ట్రాల నిర్ణయాధికారాల్లో జోక్యం చేసుకుంటే అనవసర వివాదాలు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే కేంద్రం వైసీపీ అసెంబ్లీలో సిఆర్‌డిఏ చట్టం రద్దు, మూడు రాజధానుల నిర్ణయాలను ఎన్నడూ ప్రశ్నించలేదు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం 2014-19 మధ్య నిధులను విడుదల చేసినట్టు పలు సందర్భాల్లో ప్రకటించింది.

2024 ఎన్నికల్లో కేంద్ర,రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. సుప్రీం కోర్టులో ఉన్న వివాదాలను పరిష్కరించే విషయంలో కూడా తాత్సారం జరుగుతోంది. అమరావతి నిర్మాణానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం మారి, ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో కోర్టు వివాదాలను పరిష్కరించుకోవడం, పిటిషన్లను ఉపసంహరించుకోవడం సులువైన అంశమే అయినా దానిపై కూడా రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

రాజధాని ఉన్నట్టా లేనట్టా….

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉన్నంత కాలం విభజిత రాష్ట్రానికి అదే రాజధాని ఉంది. ఒకే రాష్ట్రానికి ఏక కాలంలో రెండు రాజధానులు ఉండే అవకాశం లేనందున అమరావతిని గతంలోనే నోటిఫై చేశారనే ప్రకటనలో అర్థం ఉండకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూడు రాజధానుల అంశానికి కాలం చెల్లిందని, అమరావతిని మాత్రమే కేంద్రం గుర్తిస్తోందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఒకరు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఏపీ రాజధాని నిర్మాణం కోసం రూ.15వేల కోట్ల రుపాయల రుణానికి కేంద్ర భరోసా ఇవ్వనున్నట్టు నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ.9200కోట్లను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి రూ.60వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్టు ఏపీ పురపాలక మంత్రి నారాయణ ఇటీవల ప్రకటించారు.

దేశంలో ఎవరికీ లేని పరిస్థితి…

దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాజధాని నగరాల ఎంపిక విషయంలో మరే రాష్ట్రంలో తలెత్తని సమస్య ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఎదురైంది. రాజధాని విషయంలో వైసీపీకి అమరావతిపై ఎలాంటి ఆసక్తి లేదని ఇప్పటికే స్పష్టమైంది. విశాఖను రాజధానిగా చేసుకుని పాలన చేయాలని అక్కడ శాశ్వత నిర్మాణాలు కూడా చేశారు. ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ ఓటమి పాలైంది.

భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పరిస్థితి ఏమిటనే దానిపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమరావతి నిర్మాణానికి రూ.60వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో రాజధానిపై ఉన్న సందిగ్ధతలకు ముగింపు పలకాల్సి ఉంది.

(అమరావతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నోటిఫై చేశాయా,లేదా మరో కథనంలో)

Whats_app_banner

సంబంధిత కథనం