Visakha Capital: సెప్టెంబర్ నుంచి విశాఖలోనే తాను కాపురం ఉంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.గతంలో జులై నాటికి విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటవుతుందని ప్రకటించిన సిఎం మూలపేట పోర్టు శంకుస్థాపన నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సెప్టెంబర్ నాటికి విశాఖపట్నంలో కాపురం ఉంటానని ప్రకటించారు. రాష్ట్రంలో అందరికి అమోదయోగ్యమైన విశాఖను వికేంద్రీకరణలో భాగంగా పరిపాలన రాజధాని చేయడాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని సిఎం చెప్పారు.
ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే ఉద్దేశంతోనే, అన్ని జిల్లాల అభివృద్ధి చెందాలని, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన తపన, తాపత్రయం అన్నారు.
మరోవైపు శ్రీకాకుళం బహిరంగ సభలో సిఎం వైసీపీ ఎన్నికల ప్రచారభేరి షురూ చేశారు. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనుని ప్రకటించారు. ఎలాంటి గందరగోళానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో దువ్వాడ శ్రీనుకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనుకు అంతా మద్దతివ్వాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
ఉత్తరాంధ్ర సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుకోడానికి ఒక్క మంచి పని కూడా చేయని వారంతా తనకు వ్యతిరేకంగా ఏకం అవుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఒకే అబద్దాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే చీకటి యుద్ధం రాష్ట్రంలో జరుగుతోందన్నారు.
ఆంధ్రాలో వ్యవస్థల్ని మేనేజ్ చేసేవారికి, ప్రజల్ని నమ్ముకున్న వారికి మధ్య యుద్ధం జరుగుతోందని, తనకు పత్రికలు, టీవీలు లేవని, టీడీపీ మాదిరి దత్తపుత్రుడు కూడా లేరని సిఎం జగన్ చెప్పారు. ప్రత్యర్థులతో జరుగుతున్న యుద్ధంలో తన ధైర్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం ప్రజలేనని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దేవుడి దయ, ప్రజల చల్లని ఆశీస్సులు మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు.
తనను ఓడించడానికి తోడేళ్లంతా ఏకమవుతున్నా తనకు భయం లేదన్నారు. ప్రజలు అబద్దాలను నమొద్దని, అబద్దాలు చెప్పే అలవాటు తనకు లేదని, ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి జరిగిందో లేదో కొలమానంగా తీసుకోవాలని, ప్రజలే సైనికుల మాదిరి యుద్ధానికి కదిలి రావాలన్నారు.
దేవుడి దయ, ప్రజల చల్లని ఆశీస్సుల మీదే తనకు నమ్మకం ఉందని సిఎం జగన్ చెప్పారు. దేవుడి చల్లని దీవెనలు, ప్రజల ఆశీస్సులు తన ప్రభుత్వానికి ఉండాలన్నారు. టెక్కలి నియోజక వర్గంలో ఎప్పుడూ గందరగోళం ఉండకూడదని, దువ్వాడ శ్రీనుకు తోడుగా ఉండాలని సూచించారు. టెక్కలికి సంబంధించి సంతబొమ్మాళి 94 గ్రామాలకు మంచి నీటిసరఫరా కోసం రూ.70కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.