AP Fee Reimbursement: ఏపీలో ఫీజు బకాయిల భారం.. విద్యార్ధులకు కావాలి భరోసా, కాలేజీల ఒత్తిడితో విలవిల-the burden of fee arrears in ap students need assurance colleges are struggling under pressure ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Fee Reimbursement: ఏపీలో ఫీజు బకాయిల భారం.. విద్యార్ధులకు కావాలి భరోసా, కాలేజీల ఒత్తిడితో విలవిల

AP Fee Reimbursement: ఏపీలో ఫీజు బకాయిల భారం.. విద్యార్ధులకు కావాలి భరోసా, కాలేజీల ఒత్తిడితో విలవిల

Sarath Chandra.B HT Telugu

AP Fee Reimbursement: ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్న కాలేజీలు ఖాతరు చేయడం లేదు. 2023-24 పోస్ట్‌ మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిల వసూలు కోసం కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. విద్యాశాఖ భరోసా ఇచ్చినా ఫీజులు చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్‌

AP Fee Reimbursement: ఏపీలో కాలేజీ విద్యార్ధుల ఫీజు బకాయిలు.. విద్యార్ధుల పాలిట శాపంగా మారాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల్లో ఒక విడత మాత్రమే వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. 2024 మార్చి1 న జగనన్న విద్యా దీవెన ఫీజుల్ని విడుదల చేస్తూ బటన్‌ నొక్కినా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఎన్నికల కోడ్ రావడంతో ఫీజుల చెల్లింపు నిలిచిపోయింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఖజానాలో నిధులు అందుబాటులో ఉన్న సమయంలో కూడా వాటిని చెల్లించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది.

ఏపీలో పోస్ట్‌ మెట్రిక్ ఫీజుల చెల్లింపు భారం విద్యార్థుల్ని ఒత్తిడికి గురి చేస్తోంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిల్ని తక్షణం చెల్లించాలని ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. 2023లో ఇంజనీరింగ్ కాలేజీల సగటు ఫీజును ఏపీ హైకోర్టు రూ.43వేలకు ఖరారు చేసింది.

వైసీపీ అధికారంలో ఉన్న చివరి ఏడాది ఒక విడత మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేసింది. 2023లో కాలేజీల్లో చేరిన విద్యార్థులకు మరో నెలలో మూడో ఏడాది కోర్సులో ప్రవేశిస్తారు. దీంతో మొదటి ఏడాది ఫీజుల్ని నెలలో చెల్లించాలని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి.

ప్రభుత్వం ఫీజు బకాయిల్ని విడుదల చేసినపుడు విద్యార్థులు తీసుకోవాలని, ప్రస్తుతం కాలేజీలకు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని తేల్చి చెబుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే వసూలు చేసిన కాలేజీలు..

ఇంజనీరింగ్ విద్యార్థుల్ని మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించాలంటే ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలు రాయనిస్తామని కాలేజీలు తేల్చి చెప్పడంతో గత ఏడాది జూన్‌లోనే కొందరు విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఫీజు బకాయిలు చెల్లించడానికి కూటమి ప్రభుత్వానికి కొంత సమయం కావాలని, బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కొన్ని కాలేజీలు వేచి చూశాయి. 204-25 సంవత్సరానికి సంబంధించిన ఫీజుల్ని కాలేజీలకు నేరుగా చెల్లిస్తోంది. 2023-24 సంవత్సరాలకు సంబంధించిన బకాయిలు అందకపోవడంతో కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి.

మండలిలో ప్రస్తావననన

2024లో ఏపీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన నిధులను 2024 మార్చి 1న జగన్ బటన్‌ నొక్కి తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్టు ప్రకటించారు. జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అయితే అవి విద్యార్థులకు చేరలేదు. కృష్ణాజిల్లా పామర్రులో జరిగే బహిరంగ సభలో తల్లులు, విద్యార్థుల జాయింట్‌ ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను జమ చేస్తూ బటన్‌ నొక్కారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు జగన్‌ ప్రభుత్వం రూ.18,002 కోట్లను వ్యయం చేసిందని జగన్ ప్రకటించుకున్నారు.

ఫీజు రియింబర్స్‌మెంట్‌లో భాగంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ క్రమంలో గత విద్యా సంవత్సరం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు.

చెల్లిస్తామని నారా లోకేష్ హామీ…

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.788 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించినట్టు నారా లోకేష్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో జరిపిన చర్చల్లో భాగంగా వైసిపి ప్రభుత్వం పెట్టిన రూ.4271 కోట్లు బకాయిలు కూడా విడతల వారీగా చెల్లిస్తామని చెప్పారు. తన ప్రతిపాదనకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అంగీకరించాయని గత ప్రభుత్వ విధానాన్ని మార్చి ఇప్పుడు ఫీజులు నేరుగా కళాశాలలకే చెల్లిస్తున్నామని ప్రకటించారు.

ఒత్తిడి చేస్తే ఫిర్యాదు చేయండి…

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలను అతి త్వరలోనే చెల్లిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఒక వేళ ఏదైనా కళాశాల యాజమాన్యం విద్యార్థుల పై ఒత్తిడి చేస్తే తల్లిదండ్రులు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఒత్తిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని సభలో హామీ ఇచ్చారు.

భరోసా కోరుతున్న విద్యార్థులు..

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేసినా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వాటిని ఖాతరు చేయడం లేదు. నెల రోజుల్లో ఫీజు బకాయిలు మొత్తం క్లియర్ చేయకపోతే విద్యార్ధుల్ని పరీక్షలకు అనుమతించమని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వం బకాయిలను విడుదల చేశాక ఆ డబ్బు విద్యార్థులు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి కాలేజీలకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని వేడుకుంటున్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం