Assam Murder: అస్సోంలో ప్రకాశం జిల్లా అధ్యాపకుడి దారుణ హత్య, క్లాస్‌రూమ్‌లో విద్యార్ధిని మందలించడమే కారణం-the brutal murder of a teacher of prakasam district in assam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Assam Murder: అస్సోంలో ప్రకాశం జిల్లా అధ్యాపకుడి దారుణ హత్య, క్లాస్‌రూమ్‌లో విద్యార్ధిని మందలించడమే కారణం

Assam Murder: అస్సోంలో ప్రకాశం జిల్లా అధ్యాపకుడి దారుణ హత్య, క్లాస్‌రూమ్‌లో విద్యార్ధిని మందలించడమే కారణం

Sarath chandra.B HT Telugu

Assam Murder: తరగతి గదిలో ప్రిన్సిపల్ ముందు ఓ విద్యార్ధిని అధ్యాపకుడు మందలించాడు. దీనిని అవమానంగా భావించిన విద్యార్ధి ఆ తర్వాత క్లాస్‌రూమ్‌‌లోనే ప్రిన్సిపల్‌ను పొడిచి చంపేశాడు.

హత్యకు గురైన అధ్యాపకుడు

Assam Murder: ప్రకాశం జిల్లాకు చెందిన అధ్యాపకుడు అస్సోంలో హత్యకు గురయ్యారు. తరగతి గదిలోనే విద్యార్ది హత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు క్లాస్‌రూమ్‌లో మరో అధ్యాపకుడు ప్రిన్సిపల్‌ ముందు మరో అధ్యాపకుడు విద్యార్ధిని మందలించారు. అతని ప్రవర్తనపై కాలేజీ ప్రిన్సిపల్ పేరెంట్స్‌కు సమాచారం ఇవ్వడంతో కక్ష పెంచుకుని తరగతి గదిలోనే హత్య చేవాడు.

అస్సోంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన కెమిస్ట్రీ అధ్యాపకుడు రాజేశ్‌బాబు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలులోని అన్నవరప్పాడుకు చెందిన బెజవాడ రాజేశ్‌బాబు కెమిస్ట్రీ అధ్యాపకుడిగా బోధన వృత్తిలో ఉన్నారు. గతంలో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కాలేజీలో రాజేశ్‌బాబు పదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత కొందరు మిత్రులతో కలిసి అస్సోంలోని శివసాగర్‌ ప్రాంతంలో సొంతంగా కాలేజీ నెలకొల్పారు.

పదమూడేళ్లుగా అక్కడే కాలేజీ నిర్వహిస్తున్నారు. కాలేజీ ప్రిన్సిపల్‌గా రాజేశ్‌బాబు వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య అపర్ణ కూడా కాలేజీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి మ్యాథ్స్‌లో మార్కులు తక్కువగా రావడం,కాలేజీకి సరిగా రాకపోవడం, తోటి విద్యార్ధులతో దుందుడుకుగా వ్యవహరించడం వంటి చర్యలతో కాలేజీ యాజమాన్యం పలుమార్లు మందలించింది. క్లాస్‌రూమ్‌లో ప్రవర్తన బాగోకపోవడంతో మ్యాథ్స్ లెక్చరర్ శనివారం అతడిని మందలించారు. ఇంటి నుంచి పెద్దలను తీసుకురావాలని చెప్పారు.

విద్యార్ధిని అధ్యాపకుడు మందలిస్తున్న సమయంలో ప్రిన్సిపల్‌ రాజేశ్‌బాబు అక్కడే ఉన్నారు. దీనిని అవమానంగా భావించిన విద్యార్థి అతనిపై కక్ష పెంచుకున్నాడు. అదే రోజు సాయంత్రం తన వెంట కత్తి తెచ్చుకుని తరగతి గదిలో కూర్చున్నాడు. రాజేశ్‌బాబు కెమిస్ట్రీ క్లాస్‌ చెబుతున్న సమయంలో కత్తితో దాడి చేశాడు.

రాజేశ్‌బాబు తల, ఛాతీపై పలుమార్లు పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల సిబ్బంది బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్‌బాబు దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.అతని మృతదేహాన్ని సోమవారం ఒంగోలుకు తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. దాడి చేసిన విద్యార్ధి తండ్రి చనిపోయాడని, అతని తల్లి మాత్రమే ఉందని, ఆ విద్యార్ధి తండ్రికి కూడా నేరచరిత్ర ఉన్నట్లు బంధువులు వెల్లడించారు. స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగిన అధ్యాపకుడు ఊరుకాని ఊళ్లో దారుణ హత్యకు గురికావడం స్థానికులను విషాదంలో నింపింది.