Tirumala : తిరుమలలో వైభవంగా 'కైశికద్వాదశి ఆస్థానం' - ఇలా ఒక్కరోజు మాత్రమే అలాంటి అవకాశం..!-the auspicious kaisika dwadasi asthanam was held in tirumala during the early hours on wednesday ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమలలో వైభవంగా 'కైశికద్వాదశి ఆస్థానం' - ఇలా ఒక్కరోజు మాత్రమే అలాంటి అవకాశం..!

Tirumala : తిరుమలలో వైభవంగా 'కైశికద్వాదశి ఆస్థానం' - ఇలా ఒక్కరోజు మాత్రమే అలాంటి అవకాశం..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 13, 2024 11:19 AM IST

TTD Kaisika Dwadasi Asthanam :తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించారు. మాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనమిచ్చారు. సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగింపు ఉత్సవం సాగింది. ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ఊరేగింపు వేడుక ఉంటుంది.

వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం
వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం

కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వేకువ ఝామున 4.30 నుంచి 5.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆల‌య మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.

ఒక్క రోజు మాత్రమే….

అక్కడక్కడా చిరు జల్లులుల కురవడంతో ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పురాణాల ప్ర‌కారం శ్రీ వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నంబ‌దువాన్ క‌థ‌…

కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం:

పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 18వ తేదీన నిర్వహించనున్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

Whats_app_banner