Document writer: డాక్యుమెంట్ రైటర్‌ను కాల్చేసిన దుండగులు..తూర్పు గోదావరిలో కలకలం-the assailants shot dead the document writer at home ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  The Assailants Shot Dead The Document Writer At Home

Document writer: డాక్యుమెంట్ రైటర్‌ను కాల్చేసిన దుండగులు..తూర్పు గోదావరిలో కలకలం

Sarath chandra.B HT Telugu
Nov 29, 2023 07:39 AM IST

Document writer: గోదావరి జిల్లాలో తుపాకీ కాల్పులతో డాక్యుమెంట్ రైటర్ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఇంటికి వచ్చి మాట్లాడుతున్న వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన డాక్యుమెంట్ రైటర్
కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన డాక్యుమెంట్ రైటర్

Document writer: దస్తావేజు లేఖరిని ఇంటికి వచ్చి మరీ ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి చంపిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నల్లజర్ల మండలం పుల్లలపాడులో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పుల్లలపాడుకు చెందిన కాట్రగడ్డ ప్రభాకర్‌(60) సమీపంలోని అనంతపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద డాక్యుమెంట్‌ రైటర్‌గా పనిచేస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

స్థానికంగా భూ సెటిల్‌మెంట్‌లు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయిస్తుంటారు. ఈ క్రమంలో భూ విక్రయాలపై కొనుగోలుదారులు, అమ్మకం దారులు నిత్యం ఆయన ఇంటికి వెళ్తుంటారు. మంగళవారం సాయంత్రం 6:30 ప్రాంతంలో కారులో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ప్రభాకర్‌ ఇంటికి వచ్చారని మృతుడి భార్య వివరించారు.

రూ.12 లక్షల విషయం ఏం చేశారని మాట్లాడుతుండటంతో భూమికి సంబంధించిన విషయమై ఉంటుందని భావించిన భార్య సావిత్రి లోపలకు వెళ్లిపోయారు. ఆమె లోపలకు వెళ్ళిన రెండు నిమిషాలకే తుపాకీ పేలిన శబ్దం రావడంతో ఆమె బయటకు రాగా అప్పటికే ప్రభాకర్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

అప్పటి వరకు అతనితో మాట్లాడిన ఇద్దరు కారులో పరారయ్యారు. జిల్లా ఎస్పీ జగదీష్‌, కొవ్వూరు డీఎస్పీ వర్మ, సీఐ నున్న రాజు, ఎస్సైలు ఘటనా స్థలాన్ని, సమీపంలోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. క్లూస్‌ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది.

మృతుడు ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తుంటారని, ఆ లావాదేవీల్లోనే హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. మరోవైపు నల్లజర్ల మండలం అనంతపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రైవేటు లేఖరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్‌ను మంగళవారం తుపాకీతో కాల్చిన ఘటన జిల్లా వాసులను ఉలిక్కిపడేలా చేసింది.

ప్రభాకర్‌ స్వస్థలం నల్లజర్ల మండలంలోని పుల్లలపాడు గ్రామం. భార్య సావిత్రి. వీరికి పిల్లలు లేకపోవడంతో బంధువుల అబ్బాయిని పెంచుకున్నారు. అతను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రభాకర్‌ వ్యవసాయం చేస్తూనే లేఖరిగా పనిచేస్తున్నారు. వివాదాస్పద భూములను సెటిల్‌మెంట్‌ చేస్తుంటారని స్థానికులు తెలిపారు.

మంగళవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయన భార్యకు అరటి పళ్లు ఇచ్చి, లోపల ఉన్న ప్రభాకర్‌ను బయటకు పిలిచారు. మాట్లాడుతూనే కాల్పులు జరిపినట్లు మృతుడి భార్య తెలిపింది.

అగంతకులు రెండు, మూడురోజుల నుంచి తమ ఇంటికి వస్తున్నారని, అలాగే వచ్చారనుకుంటే ఇంత ఘోరం జరిగిపోయిందని మృతుడి భార్య కన్నీరు మున్నీరుగా విలపించారు. భూవివాదాలే కారణమని పోలీసులు చెబుతున్నా, తుపాకీతో కాల్పులు జరపడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

WhatsApp channel