Konaseema Riots: కోనసీమ జిల్లా పేరు మార్పును నిరసిస్తూ అమలాపురంలో 2022 మే 24న జరిగిన అల్లర్ల ఘటనలకు సంబంధించి ఆరు కేసులను ప్రభుత్వం ఎత్తేసింది. ఆయా కేసుల్లో నిందితులందరిపై విచారణ (ప్రాసిక్యూషన్)ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చొద్దంటూ తలపెట్టిన 'చలో అమలాపురం' కార్యక్రమం అల్లర్లకు దారితీసింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.
ఆందోళన కారులు జరిపిన రాళ్ల దాడిలో అప్పటి కోనసీమ జిల్లా ఎస్పీ సహా వంద మందికి గాయాలయ్యాయి. ఆర్టీసి బస్సులు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాలపై అమలాపురం పట్టణం, తాలూకా పోలీసుస్టేషన్‌ల పరిధిలో వందల మందిపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి. అమలాపురం పట్టణ పోలీసుస్టేషన్‌లోని క్రైమ్ నంబర్ 138/2022, 139/2022, 140/2022, 141/2022, తాలూకా పట్టణ పోలీసుస్టేషన్‌లోని క్రైమ్ నంబర్ 126/2022, 127/2022 కేసులను ఎత్తేస్తూ డిసెంబరు 20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు పలు జిల్లాలకు పేర్లు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. 2022 మే 24న కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడంపై చేపట్టిన నిరసన ర్యాలీ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు అంటించారు.
కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడం సరికాదని.., కోనసీమ జిల్లాగానే ఉంచాలని ఆందోళనకు దిగారు. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో ఆందోళన జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ఆందోళనకారులు ఎస్పీ వాహనంపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఎస్పీ గన్ మెన్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన నిరసనకారులు.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోజుల తరబడి కర్ఫ్యూ విధించారు. ముమ్మడి వరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని కూడా ఆందోళన కారులు దగ్ధం చేశారు.
saఅల్లర్లు అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళన కారుల్ని అరెస్ట్ చేశారు. సీసీటీవీల ఆధారంగా కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో అమాయకుల్ని ఇరికిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం ఈ కేసుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.