AP Capital Amaravati : రాజధాని ‘అమరావతి’ అధ్యయానానికి కమిటీ - 2 రోజుల్లో విధివిధానాలు..!-the ap government has decided to set up a committee to study the works of the capital amaravati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Capital Amaravati : రాజధాని ‘అమరావతి’ అధ్యయానానికి కమిటీ - 2 రోజుల్లో విధివిధానాలు..!

AP Capital Amaravati : రాజధాని ‘అమరావతి’ అధ్యయానానికి కమిటీ - 2 రోజుల్లో విధివిధానాలు..!

HT Telugu Desk HT Telugu
Jun 16, 2024 10:27 AM IST

AP Capital Amaravati Updates : అమరావతిలో మళ్లీ పనులు పునఃప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే ఆ దిశగా సర్కార్ అడుగులు వేయగా… అక్కడ నెలకొన్న ప్రస్తుత స్థితిగతులు, తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతిలో పనులపై కమిటీ...!
అమరావతిలో పనులపై కమిటీ...! (photo source from APCRDA Twitter)

AP Capital Amaravati Updates : రాష్ట్రంలో టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో మ‌ళ్లీ అమ‌రావ‌తి చుట్టూ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్ర‌క‌ట‌న‌తో అక్క‌డ హ‌డావుడి పెరిగింది. గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసిన భ‌వ‌నాల నిర్మాణాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాల‌ను తీసివేసి… పెరిగిన పిచ్చి మొక్క‌ల‌ను తొల‌గించే పనిలో అధికార యంత్రాంగం ఉంది. మ‌రోవైపు రియ‌ల్ ఏస్టేట్ వ్యాపారుల తాకిడి కూడా పెరిగింది.

కమిటీ ఏర్పాటుకు నిర్ణయం….

ఇదిలా ఉంటే రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తి ప్రస్తుత స్థితిగ‌తులు, భ‌విష్య‌త్తులో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సూచ‌న‌లు చేసేందుకు ఒక అధ్య‌య‌న క‌మిటీని వేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యించింది. దీనికి సంబంధించిన విధి విధానాలు రెండు రోజుల్లోనే విడుద‌ల కానున్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణాల ప‌నులు ఏ స్థాయిలో నిలిచిపోయాయి? ప‌స్తుతం నిలిచిపోయిన ప‌నుల‌ను ఎలా పూర్తి చేయాలి? త‌ద‌త‌ర అంశాల‌పై అధ్య‌య‌న క‌మిటీ పరిశీలించాల్సి ఉంటుంది.

ఈ కమిటీలో సీఆర్డీఏ, ఆర్థిక శాఖ, ప్లానింగ్ విభాగం అధికారుల‌తో పాటు, నిర్మాణ రంగానికి చెందిన నిపుణుల‌ను నియ‌మించ‌నున్నారు. ఈ క‌మిటీ రాజ‌ధాని ప్రాంతం అమ‌రావ‌తిలో పర్య‌టించి నిలిచిపోయిన అమ‌రావ‌తి ప్ర‌భుత్వ కాంప్లెక్స్ (ఏజీసీ)తో పాటు అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌, రోడ్లు, విద్యుత్ సదుపాయాలు, నిర్మాణంలో ఉండే భ‌వ‌నాల స్థితి గ‌తుల‌పై వేర్వేరుగా నివేదిక త‌యారు చేయనున్న‌ట్లు స‌మాచారం.

ఇప్పుడు మ‌ధ్య‌లో నిలిచిపోయిన భ‌వ‌నాల ప‌నులు, ఇత‌ర ప‌నులు చేప‌డితే ఎంత ఖ‌ర్చు అవుతుంద‌నే దానిపై ఒక నివేదిక‌ తీసుకోనున్నారు. అలాగే ధ్వంస‌మై ప‌నికిరాకుండా పోయిన నిర్మాణాల విలువ, న‌ష్టం అంచ‌నాల‌పై మ‌రో నివేదిక‌ను క‌మిటీ స‌భ్యులు త‌యారు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నివేదికల ప్ర‌క్రియ రెండు నెల‌ల్లోపే పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు.

గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో అమ‌రావ‌తి రాజ‌ధాని ఏర్పాటు చేసిన స‌మ‌యంలో రూ.48 వేల కోట్ల వ్య‌యంతో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక రూపొందించారు. దీనిలో రోడ్లు, విద్యుత్ వ్య‌వ‌స్థ‌, భూగ‌ర్భ డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, తాగునీటి స‌ర‌ఫ‌రా, ప్ర‌భుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, జ్యుడీషియ‌ల్ సిబ్బందికి అవ‌స‌ర‌మైన తాత్కాలిక భ‌వ‌నాల నిర్మాణానికి సుమారు రూ.9000.50 కోట్ల వ‌ర‌కూ ఖర్చు చేశారు. సుమారు రూ.1,000 కోట్ల విలువైన సామాగ్రిని దిగుమ‌తి చేశారు. రూ.11 వేల కోట్ల‌తో ప్ర‌ణాళిక రూపొందించారు.

2019లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి చెంది, వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆ ప‌నుల‌న్నీ మ‌ధ్య‌లోనే నిలిచిపోయాయి. ఈ ఐదేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం కోసం తెచ్చిన సామాగ్రిని కొంత కాంట్రాక్ట‌ర్లు త‌ర‌లించుకుపోగా, మ‌రికొంత దొంగలించారు. ప్ర‌స్తుతం మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంటుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డ ప‌నులు ప్రారంభించారు.

అమ‌రావ‌తి ప‌రిధిలోని మాస్ట‌ర్ ప్లాన్‌లో పేర్కొన్న విధంగా ఈ (ఈస్ట్‌) 6, 7, 8, 14, ఎన్ (నార్త్‌) 4, 9, 14, 17 నెంబ‌ర్ ఆర్టిరియ‌ల్ రోడ్ల‌ను 50 (200 అడుగులు) మీట‌ర్ల మేర వెడ‌ల్పుగా వేయ‌నున్నారు. ఇవి రాజ‌ధాని ప‌రిధిలో తూర్పు నుండి ప‌డ‌మ‌ర‌కు వెళ్లే రోడ్లు. ఉత్త‌ర ద‌క్షిణ దిశ‌ల్లో ఉండే రోడ్లు 27 ఉన్నాయి. ఇవ‌న్నీ కూడా 200 అడుగుల వెడ‌ల్పుతో వేయ‌నున్నారు. వీటికి ఆనుకున్న ఉన్న ముళ్ల పొద‌ల‌ను తొల‌గించేందుకు సీఆర్డీఏ రూ 67.87 ల‌క్ష‌ల‌తో ఎనిమిది టెండ‌ర్ల‌ను పిలిచింది. టెండ‌ర్ల ప్ర‌క్రియ ముగిసిన త‌రువాత‌, ప‌నులు ప్రారంభం అవుతాయి.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

WhatsApp channel