AP Mlc Election Results 2025 : ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏడో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి విజయానికి కావాల్సిన 51 శాతం ఓట్లు రాజశేఖరం సాధించారు. దీంతో మరో రౌండ్ కౌంటింగ్ ఉండగానే పేరాబత్తుల రాజశేఖరం గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులుపై పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందారు. ఏడు రౌండ్ల కౌంటింగ్ లో రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. ఆయన మొత్తం లక్షా 12 వేల 331 ఓట్లు సాధించగా... పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులు 41,268 ఓట్లు సాధించారు. దీంతో వీర రాఘవులుపై పేరాబత్తుల 71,063 ఓట్ల ఆధిక్యతలో నిలిచారు. విజయానికి కావాల్సిన 51 శాతం ఓట్లు రావడంతో రాజశేఖరం విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి 1,96,000 ఓట్లను లెక్కించారు. వీటిలో చెల్లిన ఓట్లు 1,78,422 ఉండగా, చెల్లని ఓట్లు 17,578 ఉన్నాయి. ఇంకా దాదాపు 22,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది.
ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. మొత్తం తొమ్మిది రౌండ్లకు...మంగళవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో చివరి రౌండ్ పూర్తైంది. ఈ సమయంలో ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7వ రౌండ్ ముగిసే సరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 2,41,873 ఓట్లు పోలవ్వగా, ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి 21,577 చెల్లని ఓట్లును అధికారులు గుర్తించారు.
దీంతో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను విజేతగా ప్రకటించారు. తొమ్మిదో రౌండ్ పూర్తయ్యే సరికి ఆలపాటికి 1,45,057 ఓట్లు పోలయ్యాయి. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించడగా... లెక్కింపు ముగిసే సరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజార్టీ వచ్చింది. చెల్లుబాటు అయిన ఓట్లలో 60 శాతం పైగా ఓట్లను ఆలపాటి రాజా సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు.
ఉత్తరాంధ్ర టీచర్ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులునాయుడు విజయం సాధించారు. ఇక్కడ మేజిక్ ఫిగర్ 10,068 ఓట్లు కాగా తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే గాదె శ్రీనివాసులు నాయుడు 12,035 ఓట్లు సాధించారు. దాంతో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్నారని టీడీపీ ట్వీట్ చేసింది. దీంతో కూటమి పాలనకు ఇది మ్యాండెట్ అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ స్థానంలో గాదె శ్రీనివాసులు, రఘువర్మ ఇద్దరికీ కూటమి పార్టీలు మద్దతు తెలిపాయని టీడీపీ తెలిపింది. హోరాహోరీగా జరిగిన పోటీలో శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారని పేర్కొంది.
సంబంధిత కథనం