CRDA Building Design : ఏపీ సీఆర్డీఏ భవనం.. ఈ డిజైన్‌కే ఎక్కువమంది మొగ్గు!
CRDA Building Design : అమరావతిలో ప్రభుత్వం సీఆర్డీఏ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ భవనం డిజైన్లపై ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశం ఇచ్చింది. తాజాగా.. ప్రజలు మొగ్గుచూపిన భవనం వివరాలను అధికారులు వెల్లడించారు. ఎక్కువ మంది 4వ డిజైన్ బాగుందని అభిప్రాయపడ్డారు.
అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఏపీ సీఆర్డీఏ భవనం ఎలా ఉండాలనే దానిపై.. అధికారులు అభిప్రాయ సేకరణ నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సీఆర్డీఏ వెబ్‌సైట్ ద్వారా ఓటింగ్ నిర్వహించగా.. వారం రోజుల్లో 9,756 మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. 4వ డిజైన్‌కు 3 వేల 354 మంది ఓటు వేశారు. ప్రజల అభిప్రాయాలను అధికారులు సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచారు.
ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు బిల్డింగ్ ఎలా ఉండాలనే దానిపై అధికారులు వెబ్‌సైట్ ద్వారా పోలింగ్ నిర్వహించారు. ఈ మేరకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ కాటమనేని వారం కిందట ప్రకటన విడుదల చేశారు. రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వాములు చేయాలనే మౌలిక అంశాన్ని అమలులో పెడుతున్నట్లు కమిషనర్ వివరించారు.
ప్రతి అంశాన్ని ప్రజలకు నచ్చిన విధంగా.. వారి ఆమోదంతో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్టు కార్యాలయ నిర్మాణం సైతం ఎలా ఉండాలనే దానిపై ప్రజలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. అందు కోసం పది ఆకర్షణీయమైన డిజైన్లను రూపొందించి వెబ్‌సైట్‌లో ఉంచామని చెప్పారు.
ప్రజలు తమకు నచ్చిన డిసైన్ మీద క్లిక్ చేసి ఓటు చేయాలని అధికారులు కోరారు. మెజార్టీ ఓట్ల ఆధారంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. మెజార్టీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించారు. వీటిపై ఓటింగ్‌ను డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు. దీంతో ప్రజలు పెద్దఎత్తువ తమ అభిప్రాయాన్ని చెప్పారు.
మెజారిటీ ఓటింగ్‌ను అనుసరించి భవన డిజైన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రజలు ఎక్కువ 4వ డిజైన్‌కు ఓటు వేశారు. దీంతో దీన్నే ఖరారు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు అమరావతి విషయంలో చంద్రబాబు దూకుడుగా ఉన్నారు. ఇటీవల అమరావతిలో చంద్రబాబు ఇంటిస్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వెలగపూడి రెవెన్యూ పరిధిలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం.