TG Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధ్యయన కమిటీ
TG Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై ఉన్నతస్థాయి అధ్యయన కమిటీని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. వారం రోజుల్లో కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వినియోగాదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలన్నారు.
TG Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి అధ్యయన కమిటీని నియమించారు. ఈ కమిటీ వారం రోజుల్లోగా తమ అధ్యయనాన్ని పూర్తి చేసి సమగ్ర విధివిధానాలతో నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌తో కమిటీని నియమించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా.. గనుల శాఖపై సీఎం సచివాలయంలో మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతి కుమారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.
తక్కువ ధరకే ఇసుక
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభించనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు సౌకర్యంగా ఇసుక విధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు.
వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని.. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూళ్లు కాకపోవడంపైనా అధికారులను సీఎం ప్రశ్నించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని సీఎం ఆదేశించారు.
ఇందిర్మ ఇళ్లు-కొత్త అప్లికేషన్లు
ప్రస్తుతం కొత్త వారి నుంచి కూడా ఇందిరమ్మ ఇంటి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో అర్హత గల వారి పేర్లను పరిశీలించి… గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించారు.
లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం షెడ్యూల్ ను ప్రకటిస్తామని గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. అర్హత గల ప్రతి ఒక్కర్నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి వరకు కూడా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విడుదలైన అర్హత జాబితాలోని పేర్లతో పాటు కొత్త దరఖాస్తులను కూడా పరిశీలించనుంది. అర్హత గల వారి వివరాలను మరోసారి అన్ని కోణాల్లో పరిశీలించనున్నారు. ఇందిరమ్మ కమిటీల సాయంతో లబ్ధిదారులను గుర్తించనున్నారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కనుంది. గ్రామసభల్లో అర్హుల జాబితాలను ప్రకటించారు. అయితే వీటిని పరిశీలించి… ఫైనల్ లిస్టులను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో మాత్రమే ప్రస్తుతం ఈ స్కీమ్ అమలు కానుంది. అయితే మిగతా గ్రామాల్లో లబ్ధిదారులను ఎప్పుడు గుర్తిస్తారనేది ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు భారీస్థాయిలో ఆశావహులు ఈ స్కీమ్ కోసం ఎదురుచూస్తున్నారు.
సంబంధిత కథనం