Phirangipuram Land Dispute: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పండుగ పూట ఉద్రిక్తత.. ప్రార్థనా స్థల గోడల్ని కూల్చేసిన పోలీసులు
Phirangipuram Land Dispute: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకుని ప్రార్థనా స్థలం గోడల్ని కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రార్థనా స్థలానికి కేటాయించిన స్థలంలో ప్రైవేట్ రోడ్డు వేయడం కోసం పోలీసులు బల ప్రయోగం చేయడం చర్చనీయాంశంగా మారింది.
Phirangipuram Church Land: సంక్రాంతి పండుగ పూట గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఓ ప్రార్థనా మందిరానికి చెందిన స్థలంలో పోలీసులు బలవంతంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. మూడ్రోజులుగా వందలాది మంది పోలీసులు గ్రామంలో మొహరించడం ఉద్రిక్తత కొనసాగుతోంది. ప

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు గ్రామంలో 1903లో బ్రిటిష్ ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో గ్రామస్తులు ప్రార్థనా మందిరం నిర్మించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. దాని వెనునక మరో మతానికి చెందిన వారి స్థలం చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారు. మూడు మతాలకు అప్పట్లోనే బ్రిటిష్ ప్రభుత్వం వేర్వేరుగా భూములు కేటాయించి వాటికి హద్దుల్ని కూడా నిర్ణయించింది.
గ్రామంలో ప్రార్థన స్థలానికి వెనుక దక్షిణ భాగంలో స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పట్టాలో దానిని మరో మతానికి సంబంధించిన హద్దుగా పేర్కొన్నారు. దీంతో రోడ్డు నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. కొన్నేళ్ల క్రితం ప్రార్థనా స్థలం అన్యాక్రాంతం కాకుండా ప్రహరీ గోడను కూడా నిర్మించుకున్నారు. ప్రార్థనా స్థలాలకు వెనుక వైపు నివాసాలు ఉన్న వారి రాకపోకలకు వీలుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతుండగా మరో వర్గం దానిని వ్యతిరేకిస్తోంది.
దీనిపై రెవిన్యూ, జిల్లా యంత్రాంగం ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయకపోయినా జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఉదయం వందల సంఖ్యలో పోలీసులు గ్రామంలోకి ప్రవేశించి ప్రహరీ గోడల్ని కూల్చేసి అప్పటికప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఓ రాజకీయ పార్టీ నాయకులు మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతో ప్రార్థనా మందిరం గోడల్ని కూల్చేసి రోడ్డు నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తున్నారు. మూడ్రోజులుగా గ్రామంలో భారీగా పోలీసుల్ని మొహరించడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. బ్రిటిష్ ప్రభుత్వం మంజూరు చేసిన స్థలం పట్టాలతో హద్దులు స్పష్టంగా ఉన్నా పోలీసులు దౌర్జన్యంగా స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామంలోని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది.
సివిల్ వివాదాలను న్యాయస్థానాల్లో మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉండగా పోలీసులే పంచాయితీలు చేయడం ఏమిటని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం మూడు కుటుంబాలకు లబ్ది చేయడానికి తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఏకపక్షంగా ప్రహరీలు కూల్చేశారని, రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రహరీ కూల్చివేతకు ఆదేశాలిచ్చిన వారిపై కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.