గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ - ఇవాళ ఏం జరగబోతుంది..?-tension builds in greater visakhapatnam municipal corporation ahead of no confidence motion against mayor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ - ఇవాళ ఏం జరగబోతుంది..?

గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ - ఇవాళ ఏం జరగబోతుంది..?

గ్రేటర్ విశాఖ పీఠం ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అవిశ్వాస నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో... ఓవైపు కూటమి నేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ సమావేశం ఉండగా…. భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జీవీఎంసీ (ఫైల్ ఫొటో)

గ్రేటర్ విశాఖ వైజాగ్ మేయర్ అవిశ్వాస వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. సభ్యులు నోటీసు ఇచ్చిన నాటి నుంచి లెక్కలు మారిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం కానుంది. దీంతో జీవీఎంసీ దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కోరం ఉంటేనే ఓటింగ్….

ఈ సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడా సభ్యులు ఉంటేనే ఓటింగ్‌ నిర్వహించనున్నారు. చేతులెత్తి ఓటుకు ఆమోదం తెలపనున్నారు. హాల్‌లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి ఉండనున్నారు. సభ్యులను రో అధికారులు కౌంట్‌ చేయనున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకే మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

విశాఖ చేరుకున్న కార్పొరేటర్లు…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన మేయర్ జి.హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు శనివారం కౌన్సిల్ సమావేశం కానుంది. ఇదిలావుంటే… తెలుగుదేశం పార్టీ మలేషియాకు పంపిన పలువురు కార్పొరేటర్లు శుక్రవారం రాత్రి విశాఖకు తిరిగి వచ్చారు. కీలకమైన ఓటింగ్ కు ముందు ఫిరాయింపులను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్సార్ సీపీ తన కార్పొరేటర్లను శ్రీలంకకు పంపింది.

బహిష్కరించిన వైసీపీ….

ఇవాళ జరిగే కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలని జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నిర్ణయించింది. కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకావొద్దని…. ఎవరైనా ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని పార్టీ విప్ జారీ చేసింది.

అవిశ్వాస తీర్మానం ముందుకు సాగాలంటే టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమికి మొత్తం 98 ఓట్లలో కనీసం 74 ఓట్లు రావాలి. జీవీఎంసీలో 98 వార్డులకు 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు 48 మంది టీడీపీ, 11 మంది జనసేన, ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు.

మరోవైపు 34 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు తమవైపు ఉందని వైసీపీ పేర్కొంది. సీపీఐ, సీపీయంలకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు ఇప్పటికే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ఇటీవల ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. అంతేకాకుండా ఎక్స్ అఫీషియో సభ్యుడు బెహరా భాస్కరరావు కూటమికి మద్దతు ప్రకటించారు. ఇక 6వ వార్డుకు చెందిన వైసీపీ కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించారు. అవిశ్వాస తీర్మానంలో ఆమె పాల్గొంటారా లేదా అనేది తేలాల్సి ఉంది…! 

మొత్తంగా అవిశ్వాస తీర్మానంలో నెగ్గి… పీఠాన్ని చేజిక్కించుకోవాలని కూటమి గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కూటమి వ్యూహాలను అడ్డుకుని… పీఠాన్ని కాపాడుకోవాలని వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో… జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.