Polavaram Left canal: జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపు, పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులకు టెండర్లు పూర్తి
Polavaram Left canal: పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రకు ఈ ఏడాది జూలై నాటికి గోదావరి జలాలను అందించే పనుల్ని పూర్తి చేస్తామని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల ప్రకటించారు. ఎడమ కాల్వ మిగులు పనులకు టెండర్లు ఖరారు చేసినట్టు వెల్లడించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు.
Polavaram Left canal: 2025 ఏడాది జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించేలా ఏజెన్సీలు, అధికారులు పనులు చేపట్టాలని ఆదేశించామని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనుల పురోగతిపై ఆయా శాఖాధికారులతో విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ. 1050 కోట్లతో ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి లెఫ్ట్ కెనాల్ పూర్తిచేసి, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకెళ్ళాలనే హామీని నెరవేర్చుతామన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలకు తాగు, సాగు నీటి సమస్యకు ముగింపు లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో లెఫ్ట్ కెనాల్ పనులను పక్కనపెట్టడంతో పాటు కనీసం ఒక్క తట్ట మట్టి కూడా తవ్వలేదని, నిర్వాసితులకు ఒక్క రూపాయి నష్టపరిహారం కూడా అందించలేదని విమర్శించారు. ఇదంతా ఒకెత్తు అయితే లెఫ్ట్ కెనాల్ పనులు చేపట్టకపోగా, పనులను ప్రీక్లోజర్ చేసి ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.
పోలవరం లెఫ్ట్ కెనాల్ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుండి 8,122 క్యూసెక్కులకు తగ్గిస్తూ ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు గండికొట్టిందని నిమ్మల ఆరోపించారు.
ఎన్డియే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల్లోనే మొదటి ప్రాధాన్యతగా పోలవరం ప్రాజెక్ట్ ను, రెండో ప్రాధాన్యతగా పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను పరిశీలించారని మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తుచేశారు.
గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సైతం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ కు మన ముఖ్యమంత్రి రూ. 1600 కోట్లను కేటాయించడం హర్షనీయమన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి, ఉత్తరాంధ్రకు తాగు, సాగు నీరందించి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో పోలవరం డయాఫ్రంవాల్ ధ్వంసమైందని విమర్శించారు. 990 కోట్ల రూపాయలతో డయా ఫ్రం వాల్ పున:నిర్మాణం చేయాల్సి వచ్చిందన్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ప్రాజెక్టు నిర్మాణంలో సమయం వృధా కాకుండా డయా ఫ్రం వాల్ నిర్మాణం ఓదశకు రాగానే సమాంతరంగా ఈసిఆర్‌ఎఫ్ నిర్మాణం కూడా మొదలుపెడతామని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పటికప్పుడు ప్రతి రోజూ ఎంతమేర జరిగాయని తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకునేలా వెబ్సైట్ రూపొందిస్తున్నామని, ఎప్పటికప్పుడు పనుల వివరాలు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తామని వివరించారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమలను సస్యశ్యామలం చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా రోజువారి రివ్యూలు నిర్వహించి పనులను వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్ లను పూర్తి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.
సంబంధిత కథనం