Tirupati Temple Expo : దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం కీలక పాత్ర -సీఎం చంద్రబాబు
Tirupati Temple Expo : దేశంలో టెంపుల్ టూరిజం వృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఏడు నెలల్లోనే ఏపీలోని ఆలయాలకు రూ.134 కోట్లు ఖర్చు చేశామన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోస్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.

Tirupati Temple Expo : దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజంది ప్రత్యేక పాత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ వినియోగంతో మరింత ముందుకెళ్లాలన్నారు. దేవాలయాల నిర్వహణలో సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారని, ఎందరో భక్తులు రూ.కోట్ల విరాళాలు ఇస్తున్నారన్నారు. ఆ విరాళాలను పేదల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. తిరుపతిలో ప్రారంభమైన అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోస్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
"ప్రతి రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో, ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి. ఎక్కడ తెలుగు వారు అంటే, ఆయా దేశాల్లో కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి. ఈ దిశగా టీటీడీ పని చేసి, దేవాలయాలు నిర్మిస్తుంది. పీ-4 విధానంలో దేశంలో మౌలిక వసతులు మరింత పెరగాలి. దేవుడి సేవ మాత్రమే కాదు, మానవ సేవ కూడా ఎంతో ముఖ్యం. ఏడు నెలల్లోనే ఏపీలోని ఆలయాలకు రూ.134 కోట్లు ఖర్చు చేశాం. అర్చకులకు జీతాలు పెంచాం, వేద పాఠశాలలకు నిధులు ఇస్తున్నాం"- సీఎం చంద్రబాబు
55 కోట్ల మంది పుణ్యస్నానాలు
కుంభమేళాలో 55 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంట్లో ఒక ఏఐ నిపుణుడు తయారవుతున్నారన్నారు. కుటుంబ వ్యవస్థ భారత దేశానికి అతిపెద్ద బలం అన్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర అని సీఎం చెప్పుకొచ్చారు. దేవుడికి సేవచేయడం అన్నింటికంటే ఎంతో గొప్పదన్నారు.
"తిరుమల బాలాజీ అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసం, నమ్మకం. రాష్ట్రంలోని దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం. తిరుమలలో 75శాతం పచ్చదనం ఉండేలా చూస్తున్నాం. ఏపీలోని ఆలయాల్లో సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నాం. దేవాలయాల్లో గ్రీన్ ఎనర్జీని సపోర్ట్ చేస్తున్నారు. దేవుడికి సేవచేయడం అన్నింటికన్నా గొప్ప కార్యక్రమం అవుతుంది" -సీఎం చంద్రబాబు
55 శాతం మంది ఆలయాల సందర్శన
మన దేవాలయాల చరిత్ర ఎంతో పురాతనమైనవని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. దక్షిణ భారత్‌లోని ఆలయాలు చూసి విదేశీయులు ఆశ్చర్యపోతున్నారన్నారు. వేల ఏళ్ల క్రితం ఇలాంటి ఆలయాలు ఎలా కట్టారని అడుగుతారని అన్నారు. దేవాలయాల ప్రాంగణాల్లో ఆనాడు విద్యార్థులకు బోధన జరిగేదని తెలిపారు. నేడు 55 శాతం మంది పర్యాటకులు ఆలయాల సందర్శన చేస్తున్నారన్నారు.