AP Weather Updates: ఉక్కపోతతో జనం విలవిల, ఏపీలో మళ్లీ భానుడి భగభగలు.. రుతుపవనాల కోసం ఎదురు చూపులు
AP Weather Updates: ఏపీలో భానుడి భగభగలకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడి పోతున్నారు. రోహిణి కార్తెలో ఎండల నుంచి ఉపశమనం లభించిందని సంతోషపడే లోపు మళ్లీ వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి.
AP Weather Updates: ఏపీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీరం దాటడంతో వేసవి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా 43డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
మరోవైపై రాబోయే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశించనున్నట్టు ఐఎండి ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, దక్షిణ తమిళనాడు మరియు పరిసరప్రాంతాల్లో ఆవర్తనం విస్తరించి ఉన్నట్టు ఐఎండి ప్రకటించింది.
గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పొడి వాతావరణం నెలకొని ఉండనుంది. శుక్రవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
01 జూన్, శనివారం:
అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల మరియు వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
02 జూన్, ఆదివారం:
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కర్నూలు, నంద్యాల, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్సాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండి ప్రకటించింది. శనివారం కల్లా ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఉందని అంచనా వేస్తున్నారు.
మే 31 లేదా వచ్చే జూన్ ఒకటో తేదీకల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటి గమనం ఆశాజనకంగా ఉండడంతో గురువారం లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బుధవారం ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడికంటే ఉక్కపోతతోనే జనం అల్లాడిపోతున్నారు. రానున్న రెండు రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని ఐఎండి అమరావతి అధికారులు తెలిపారు.