AP TG Temperatures : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు - అప్పుడే మొదలైన ఎండలు..!
AP Telangana Temperatures : తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండల ప్రభావం కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత బాగా ఉంటోంది. దీంతో అప్పుడే సమ్మర్ వచ్చేసిందా అన్నట్లు అనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు హైరానా అవుతున్నారు.
ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఉక్కపోతతో పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ కూడా పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు….
ఫిబ్రవరి మాసం అంతా కూడా చలి ప్రభావం ఉంటుంది. కానీ ఈసారి చూస్తే జనవరి నెల చివరి వారం నుంచే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఫిబ్రవరి నెల కూడా పూర్తి కాకముందే... ఎండల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా రాత్రి, పగలూ వేడి వాతావరణంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
ఈ ఫిబ్రవరిలో మిశ్రమ వాతావరణం ఉంటుందని ఐఎండీ నివేదికలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల ఉదయం పూట పొగమంచు కురిసే అవకాశం ఉన్నప్పటికీ... మధ్యాహ్నం సమయంలో మాత్రం ఎండ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి.
ఏపీ వెదర్ రిపోర్ట్ - సీమలో ఎండల ప్రభావం..
ఏపీలో ఇవాళ వాతావరణం చూస్తే… ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉండనుంది. ఉదయం పలుచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాయలసీమ జిల్లాల్లో చూస్తే... ఎండ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపు కూడా ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో ఇలా…
తెలంగాణలో చూస్తే ఈ వారం పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం సమయంలో కొన్నిచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా...ఈ 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
మొత్తంగా చూస్తే మార్చి నాటికి తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... మధ్యాహ్నం సమయంలో జాగ్రతలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత కథనం