Newyork Suicide: అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. డిపోర్టేషన్ భయంతో సూసైడ్
Newyork Suicide: అమెరికా నుంచి డిపోర్టేషన్ భయంతో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని పాస్‌పోర్ట్‌ను ఫెడరల్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఆందోళనకు గురయ్యాడని స్నేహితులు చెప్పినట్టు ఎన్టీవీ ఒక కథనంలో నివేదించింది.

Newyork Suicide: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి న్యూయార్క్‌లో ఆత‌్మహత్యకు పాల్పడ్డాడు. సాయికుమార్ రెడ్డి అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల ఫెడరల్ అధికారుల తనిఖీల్లో భాగంగా సాయి కుమార్ రెడ్డి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన యువకుడు పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని ఆత్మహత్య గురించి కుటుంబ సబ్యులకు కూడా సమాచారం అందలేదని స్నేహితులు అమెరికా నుంచి తెలుగు టీవీ ఛానళ్లకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
కుటుంబ సభ్యుల వివరాలు లేకపోవడంతో ఆత్మహత్య విషయం వారికి చేరవేయలేకపోయినట్టు చెబుతున్నారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితమే అమెరికా నుంచి అక్రమంగా వలస వెళ్లిన వారిని అమృత్‌సర్‌కు తిప్పి పంపారు. మరో 18వేల మందిని గుర్తించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సాయికుమార్ రెడ్డి పాస్‌పోర్ట్ లేకపోవడం, బలవంతంగా భారత్‌కు తిప్పి పంపుతారనే ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్నేహితులు చెబుతున్నారు.
విద్యార్థి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతని ఫోన్ లాక్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యుల సమాచారం తెలియడం లేదని స్నేహితులు చెబుతున్నారు.మరోవైపు డిపోర్టేషన్ వేటు పడనున్న భారతీయులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్వదేశానికి తిరిగి రావడంపై ఆందోళన చెందుతున్నారు.
(మరింత సమాచారం తెలియాల్సి ఉంది)