APCC : కాంగ్రెస్ కండువా కప్పుకున్న సినీ నటుడు రాజా-telugu hero raja joined in indian national congress ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Telugu Hero Raja Joined In Indian National Congress

APCC : కాంగ్రెస్ కండువా కప్పుకున్న సినీ నటుడు రాజా

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 20, 2023 04:03 PM IST

Telugu Hero Raja Join in INC :కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సినీ నటుడు రాజా. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రుద్రరాజు ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజా…రాహుల్ గాంధీ స్పూర్తిగా, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని చెప్పారు.

కాంగ్రెస్ లో చేరి హీరో రాజా
కాంగ్రెస్ లో చేరి హీరో రాజా

Andhra Pradesh Congress Committee: సినీ హీరో, ఆధ్యాత్మిక బోధకుడు రాజా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో బుధవారం పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆయనకు సాదర స్వాగతం పలికారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాజాకు కండువా కప్పిన పీసీసీ అధ్యక్షులు రాజాను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి తాను ముందు నుంచి అభిమానిని అని చెప్పారు. సినిమాలు, ఆ తరువాత ఆధ్యాత్మిక జీవితంతో కొంతకాలం పార్టీకి దూరమయ్యానని వెల్లడించారు. మణిపూర్ అల్లర్ల సందర్భంగా దేశంలో ఎవ్వరూ కూడా సాహసించని విధంగా రాహుల్ గాంధీ స్పందించిన తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని, అదే స్పూర్తితో తాను పార్టీలో చేరానని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

రాహుల్ ఆలోచనా విధానం తనకు ఎంతో నచ్చిందని చెప్పారు రాజా. సెక్యులర్ భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా తనకు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను అందరూ చూస్తున్నారన్న రాజా.., అందరికీ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కూడా పార్టీకి తన సేవలు అందించేందకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విశాఖపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త, జేడీ లక్షీ నారాయణతో వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న మురారీ కూడా పీసీసీ అధ్యక్షుని సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

విజన్ ఉన్న నేత రాహుల్ - రాజా

దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా జరిగిన మణిపూర్ అల్లర్ల విషయంలో కొందరు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కనీసం నోరు మెదపలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని రాజా విమర్శించారు. అటువంటి సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చింది రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం గురించి విజన్ ఉన్న నాయకుడు రాహుల్ అని కొనియాడారు. తనకు అవకాశం ‎ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తో పాటు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాజా చేరికపై పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పందిస్తూ… రాజా లాంటి వ్యక్తుల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశాలతో పార్టీ బలోపేతానికి వాడుకుంటామని, అదే విధంగా షర్మిల వచ్చినా పార్టీ సేవలకు వినియోగించుకుంటామని పీసీసీ అధ్యక్షులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బుర్రా కిరణ్, ఏఐసీసీ సభ్యులు కొలనుకొండ శివాజీ, ఖాజా మొహిద్దీన్, లీగల్ సెల్ రాష్ట్ర ఛైర్మన్ వి.గుర్నాధం, వైస్ ఛైర్మన్ డాక్టర్ జంధ్యాల శాస్త్రి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఛైర్మన్ సాకే శంకర్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గౌస్, కుర్షీదా, అన్సారీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు

WhatsApp channel

సంబంధిత కథనం

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.