Sudeeksha Konanki: డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు యువతి అదృశ్యం, అమెరికాలో స్థిరపడిన కడప వాసులు, తల్లడిల్లుతున్నకుటుంబం-telugu girl goes missing in dominican republic kadapa residents settled in america concern for her whereabouts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sudeeksha Konanki: డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు యువతి అదృశ్యం, అమెరికాలో స్థిరపడిన కడప వాసులు, తల్లడిల్లుతున్నకుటుంబం

Sudeeksha Konanki: డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు యువతి అదృశ్యం, అమెరికాలో స్థిరపడిన కడప వాసులు, తల్లడిల్లుతున్నకుటుంబం

Sarath Chandra.B HT Telugu

Sudeeksha Konanki: ఉత్తర అమెరికా దేశమైన డొమినికన్ రిపబ్లిక్ దేశంలో తెలుగు యువతి అదృశ్యమైంది. అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుదీక్ష కోణంకి పీట్స్‌బర్గ్ యూనివర్శిటీలో చదువుతున్నారు. మార్చి 3న స్నేహితురాళ్లతో కలిసి విహార యాత్రకు వెళ్లిన సుదీక్ష మార్చి 6న అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది.

అమెరికాలో అదృశ్యమైన కోణంకి సుదీక్ష

Sudeeksha Konanki: అమెరికాలో స్థిరపడిన తెలుగు విద్యార్ధిని డొమినికన్‌ దేశంలో అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి మార్చి 3న కరేబియన్‌ తీరంలో ఉన్న పుంటాకానా ప్రాంతానికి వెళ్లిన సుదీక్ష కోణంకి మార్చి 6వ తేదీ నుంచి కనిపించక పోయింది. దీంతో ఆమె అచూకీ కోసం కుటుంబ సభ్యులతో పాటు ప్రవాస తెలుగు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.

వాషింగ్టన్‌ డీసీలో స్థిరపడిన ప్రవాస తెలుగు కుటుంబానికి చెందిన కోణంకి సుదీక్ష మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమైంది. కాలేజీ సెలవు కావడంతో మే 3న స్నేహితురాళ్లతో కలిసి డొమనికన్ రిపబ్లిక్ దేశానికి పర్యటనకు వెళ్ళింది. మే 6 తెల్లవారుఝామున 4 గంటల ప్రాంతంలో హోటల్ వెనుక వున్న బీచ్‌కు వెళ్ళారు. విద్యార్థులు బీచ్‌కు వెళుతున్న కెమెరా పుటేజ్‌లో అమ్మాయిలతో పాటు మరో ఇద్దరు మగవాళ్ళు కూడా వున్నారు. రెండు గంటల తర్వాత అందరూ హోటల్‌కు వచ్చినా సుదీక్ష రాలేదు.

రెండు వారాలుగా గాలిస్తున్నా దొరకని అచూకీ

విహారయాత్రకు వెళ్లిన 20 ఏళ్ల కాలేజీ విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యమై రెండు వారాలు గడుస్తున్నా పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదు. అమెరికా ఎఫ్‌బిఐతో పాటు, డొమనికన్‌ రిపబ్లిక్‌ దేశ దర్యాప్తు బృందాలు రెండు వారాలుగా జల్లెడ పడుతున్నా ఎలాంటి పురోగతి సాధించ లేకపోయాయి. అమెరికాలో శాశ్వత నివాసి అయిన సుదీక్ష పిట్స్ బర్గ్ యూనివర్శిటీలో చదువుతున్నారు.

కాలేజీ సెలవులు కావడంతో సుదీక్ష ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి పుంటాకానాలోని ఓ రిసార్ట్ లో విహారయాత్రకు వెళ్లారు. డొమినికన్ రిపబ్లిక్ కు తూర్పున ఉన్న "లా అల్టాగ్రాసియా ప్రావిన్స్" లోని పుంటా కానాలో ఉన్న రిసార్ట్‌‌కు వెళ్లింది. ఆ తర్వాత బీచ్‌లో ఆమె అదృశ్యమైంది.

ఈ ఘటనపై డొమినికన్ నేషనల్ పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఫలితం లేక పోవడంతో అమెరికా దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, ఎఫ్బిఐ, డిఇఎ, హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) బృందాలతో పాటు పిట్స్ బర్గ్‌ విశ్వవిద్యాలయం పోలీసులు కూడా గాలింపులో పాల్గొన్నారు.

రెండు వారాలుగా గాలిస్తున్న దొరకని అచూకీ
రెండు వారాలుగా గాలిస్తున్న దొరకని అచూకీ (AP)

తెల్లవారుజామున బీచ్‌కు వెళ్లి...

స్పానిష్ మీడియా వర్గాల ప్రకారం.. మార్చి 6వ తేదీ న తెల్లవారుజామున 4:50 గంటలకు రియు పుంటా కానాహోటల్ బీచ్‌లో సుదీక్ష చివరిసారి కనిపించింది. ఆ సమయంలో గోధుమ రంగు టూ పీస్ బికినీ, పెద్ద గుండ్రటి చెవిపోగులు, రెండు చేతులకు బ్యాండ్లను ధరించి ఉన్నారు. సుదీక్షను చివరి సారి చూసిన మిన్నెసోటా విద్యార్థి జాషువా రిబేను దర్యాప్తు బృందాలు ప్రశ్నించినా ఫలితం లేకపోయింది.

డొమినికన్ మీడియా కథనాల్లో సుదీక్షతో కలిసి చివరిసారి ఉన్న జాషువా రిబేను పోలీసులు అనుమానించారు.అతడు ఇచ్చిన సమాచారంలో నడుము లోతు నీటిలో సుదీక్షతో కలిసి మద్యం సేవిస్తుండగా బలమైన అలల తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయినట్టు వివరించాడు. అలల సముద్రంలోకి లాగుతున్న సమయంలో సుదీక్ష తో కలిసి ఒడ్డుకు చేరినట్టు వివరించినట్టు స్పానిష్ పత్రికలు పేర్కొన్నాయి.

బీచ్ కు చేరుకోగానే తనకు వాంతులు అయ్యాయని, ఆ సమయంలో సుదీక్ష తన వస్తువులను తీసుకు వస్తానని చెప్పిందని రిబే పోలీసులకు వివరించాడు. తలెత్తి చూసేసరికి ఆమె కనిపించకుండా పోయిందని ఆ తర్వాత ఏమి జరిగిందో గుర్తు లేదని పోలీసులకు చెప్పాడు. సుదీక్ష అదృశ్యమైన విషయం తెలిసి ఆశ్చర్యపోయినట్టు పోలసులకు రిబే వివరించాడు.

మరోవైపు అనువాదకులు, న్యాయవాదులు లేకుండా డొమినికన్ అధికారులు తమ కుమారుడిని అక్రమ పరిస్థితుల్లో నిర్బంధించారని, వారం రోజులకు పైగా పోలీసుల నిఘాతో హోటల్ ఉంచారని రిబే తల్లిదండ్రులు ఆరోపించారు. సెయింట్ క్లౌడ్ యూనివర్శిటీలో సీనియర్ అయిన జాషువా రిబేను పలుమార్లు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించామని, అతను పోలీసులకు పూర్తిగా సహకరించాడని తెలిపారు.

కుమార్తె అదృశ్యంపై తల్లిదండ్రుల ఆందోళన..

కోణంకి సుదీక్ష తండ్రి సుబ్బారాయుడు కోనంకి డబ్ల్యుటిఒపి-ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమార్తె సముద్రంలో మునిగిపోయిందనే భావన నుండి అధికారులు బయటపడాలని కోరారు. కిడ్నాప్, అపహరణ కోణంలో దర్యాప్తు చేయాలని దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి చేశారు. సుదీక్ష గాలింపును గత ఆదివారం నిలిపివేయాలని డొమినికన్ బృందాలు భావించిన నేపథ్యంలో దర్యాప్తును విస్తృతం చేయాలని కోరుతూ ఆదివారం ఫిర్యాదు చేసినట్లు ఎఫ్‌ఎం రేడియో పేర్కొంది

సుదీక్ష ఫోన్, పర్సు వంటి వ్యక్తిగత వస్తువులతో సహా అన్ని వస్తువులను ఆమె స్నేహితుల వద్ద విడిచిపెట్టారని ఇది అసాధారణమని సుబ్బారాయుడు పేర్కొన్నారు. ఆమె ఎప్పుడూ తన వెంట ఫోన్‌ ఉంచుకుంటుందని ఈ ఘటనపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. సుదీక్ష తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో దర్యాప్తును పర్యవేక్షించడానికి "ఉన్నత స్థాయి కమిషన్" ను ఏర్పాటు చేయడానికి డొమినికన్ రిపబ్లిక్ నేషనల్ పోలీసులు మంగళవారం నిర్ణయించారు. అమెరికా దర్యాప్తు బృందాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.ఆమె అదృశ్యమైన సమయంలో వారికి సమీపంలో ఉన్న వారందరిని తిరిగి ప్రశ్నించనున్నట్టు డొమనికన్ రిపబ్లిక్ ప్రకటించింది.

తీరంలో సుదీక్ష కోసం గాలిస్తున్న డొమనికన్ రిపబ్లిక్ పోలీసులు
తీరంలో సుదీక్ష కోసం గాలిస్తున్న డొమనికన్ రిపబ్లిక్ పోలీసులు (REUTERS)

అనుమానితుడా కాదా?

దర్యాప్తును విస్తృతం చేయాలని కోనంకి తండ్రి స్థానిక అధికారులను కోరినా ఈ కేసు నేర దర్యాప్తు కాకపోవడంతో సుదీక్ష అదృశ్యం ఘటనలో రిబేను అనుమానితుడిగా భావించడం లేదని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. ఆమెను చివరి సారి చూసిన వ్యక్తి కావడంతో ఈ ఘటన పలు సందేహాలకు తావిస్తున్నట్టు దర్యాప్తు బృందాలు అమెరికా మీడియా సంస్థలకు వివరించాయి. ఈ కేసులో జాషువా రిబే చుట్టూ అందరి ఆసక్తి నెలకొని ఉందని, ఇప్పుడే ఎలాంటి నిర్ధారణకు రాలేమని ప్రకటించాయి.

జాషువా కూడా పుంటా కానాలో విహారయాత్రకు వెళ్లిన అమెరికా పౌరుడని, గల్లంతైన సుదీక్ష బృందంలో అతను భాగం కాదని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి.సుదీక్ష ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి పుంటా కానా వెళ‌్లగా, రిసార్ట్‌ వద్ద జాషువా రిబే వారితో కలిశాడు.

అయోవాలోని రాక్ రాపిడ్స్ కు చెందిన రిబే 2023 నుంచి మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన సుదీక్ష కుటుంబం అమెరికాలోని వాషింగ్టన్ డిసి శివారులో నివసిస్తున్నారు. మరోవైపు సుదీక్ష అచూకీ కోసం అమెరికాలోని భారత కాన్సులేట్ వర్గాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.

12 రోజులుగా గాలిస్తున్న సుదీక్ష అచూకీ దొరక్క పోవడం అనుమానాలకు తావిస్తోంది.
12 రోజులుగా గాలిస్తున్న సుదీక్ష అచూకీ దొరక్క పోవడం అనుమానాలకు తావిస్తోంది. (AP)

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం