YS Viveka Wife Implied petition సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం...-telangana high court allowed ys vivekananda reddy wife implied petition in accused bail petition ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Telangana High Court Allowed Ys Vivekananda Reddy Wife Implied Petition In Accused Bail Petition

YS Viveka Wife Implied petition సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం...

HT Telugu Desk HT Telugu
Feb 17, 2023 05:39 AM IST

YS Viveka Wife Implied petition మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేకా హత్య కేసు హైదరాబాద్‌కు బదిలీ అయిన తర్వాత దర్యాప్తు వేగం పుంజుకుంది. తాజాగా ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న వై.సునీల్ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై వివేకా సతీమణ సౌభాగ్యమ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. సునీల్ యాదవ్‌కు బెయిల్‌ మంజూరు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు
వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు (tshc.in)

YS Viveka Wife Implied petition వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేయొద్దని వివేకా సతీమణ సౌభాగ్యమ్మ సిబిఐ ప్రత్యేక కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. ఈ కేసులో తమ వాదనలు కూడా వినాలని కోరారు. దీంతో వివేకా సతీమణ సౌభాగ్యమ్మ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు అనుమతించింది.

ట్రెండింగ్ వార్తలు

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న వై.సునీల్‌ యాదవ్‌ దరఖాస్తు చేసిన బెయిలు పిటిషన్‌పై విచారణ కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సునీల్‌ యాదవ్ కీలకపాత్ర పోషించారని, అతనికి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌‌‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వివేకా భార్య వై.ఎస్‌.సౌభాగ్య, కుమార్తె సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారి వాదన వినేందుకు కోర్టు అంగీకరించింది. కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. సునీల్‌ యాదవ్‌ బెయిలు పిటిషన్‌పై జస్టిస్‌ చిల్లకూరు సుమలత విచారణ చేపట్టారు.

వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్‌ యాదవ్‌ కీలకపాత్ర పోషించారని, ఆయనకు బెయిల్‌ ఇవ్వడంపై అభ్యంతరం ఉందని వివేకా భార్య వై.ఎస్‌.సౌభాగ్య, కుమార్తె సునీతారెడ్డి తరఫున న్యాయవాది స్వేచ్ఛ వాదనలు వినిపించారు. బెయిలు పిటిషన్లలో వాదనలు వినిపించే హక్కు బాధితులకు ఉందని సుప్రీంకోర్టు జగ్జీత్‌సింగ్‌ వర్సెస్‌ ఆశిష్‌ మిశ్రా కేసులో స్పష్టం చేసిందని వివరించారు.

వివేకా మరణం తరువాత సునీల్‌యాదవ్‌ చర్యల వల్ల తాము మానసికంగా వేదన అనుభవిస్తున్నందున ఈ కేసులో వాదనలు వినిపించే హక్కు తమకు ఉందని, తమను ప్రతివాదులుగా చేర్చుకోవాలని సౌభాగ్య, సునీతారెడ్డి కోరుతున్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఒకే కుటుంబం నుంచి ఇద్దరూ ప్రతివాదులుగా అవసరం లేదని, సౌభాగ్యను అనుమతిస్తామని చెప్పారు.

మరోవైపు సునీల్‌ తరఫు న్యాయవాది టి.ఎల్‌.నయన్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 'ఇంప్లీడ్‌ పిటిషన్‌లో తమ పిటిషనర్‌పై ఆరోపణలు చేశారని, దీనిపై కౌంటరు దాఖలు చేస్తామన్నారు. సునీల్‌ ఇప్పటికే 18 నెలలుగా జైలులో ఉన్నందున తక్షణం విచారణ చేపట్టాలన్నారు. హత్య కేసుతో సునీల్‌ కుమార్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా సీబీఐ ఇరికించిందని, దిల్లీలో 50 రోజులు ఉంచి వేధించారని చెప్పారు. దస్తగిరి, రంగన్న, ఉమాశంకర్‌రెడ్డిలను దర్యాప్తునకు పిలిపించినా ఆయనపై ఏమీ చెప్పలేదని అని కోర్టుకు తెలిపారు.

సునీల్్ యాదవ్‌ తరపు న్యాయవాది వాదనలపై సీబీఐ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేయాలని, అదే రోజు వాదనలు వినిపిస్తామని కోరారు. దీనికి నిందితుడు తరపు నయన్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ వాదనలు ఇప్పుడే వినిపిస్తామని, కావాలంటే సీబీఐ న్యాయవాది తదుపరి వాయిదాకు వచ్చి చెప్పవచ్చన్నారు. ఇప్పటికే సునీల్‌ 18 నెలలుగా జైల్లో మగ్గుతున్నారన్నారు.

దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ గత బెయిలు పిటిషన్‌ దాఖలైన సమయానికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. తనకు ఉన్న వ్యక్తిగత పనుల వల్ల గడువు కోరితే అభ్యంతరపెట్టడం సరికాదన్నారు. ఈ వాదనలన్నీ పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రతివాదిగా సౌభాగ్యను అనుమతించారు. కేసు విచారణను 27కి వాయిదా వేశారు. 27వ తేదీ లోగా కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆదేశించారు.

WhatsApp channel

టాపిక్