Revanth Reddy In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మనుమడికి పుట్టు వెంట్రుకల సమర్పణ
RevanthReddy In Tirumala: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర‌్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.
RevanthReddy In Tirumala: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు.
బుధవారం వేకువ జామున రేవంత్ రెడ్డి మనుమడికి పుట్టు వెంట్రుకలు సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమలకు వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
తెలంగాణ తరపున తిరుమలలో కళ్యాణ మండపం నిర్మించాలని భావిస్తున్నట్లు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ప్రయత్నాలు ప్రారంభిస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడవాలని, సమస్యల్ని పరిష్కరించుకుని, ఒకరికొకరు సహకరించుకుని ముందుకు సాగాలని అకాంక్ష వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తరపున సత్రం, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అందుకోసం ఏపీ ముఖ్యమంత్రిని కలిసి తెలంగాణ ప్రభుత్వం తరపున కళ్యాణ మండప నిర్మాణం చేపట్టాలని కోరనున్నట్టు చెప్పారు.