పబ్జీలో ఓడినందుకు ఆత్మహత్య.....
పబ్జీ ఆటలో ఓడిపోయినందుకు తోబుట్టువులు ఎగతాళి చేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగింది. మృతుడి తల్లి మాత్రం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మృతుడి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆటలో ఓడిపోవడంతో తోబుట్టువులు ఎగతాళి చేశారనే అవమానంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నం చిలకలపూడి హౌసింగ్‌బోర్డులో నివసించే శాంతిరాజు కుమారుడు ప్రభు పబ్జీ ఆటలో ఓడిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మృతుడి తండ్రి శాంతిరాజు రెండో వివాహం చేసుకోవడంతో మనస్ఫర్థలతో మొదటి భార్య, భర్త నుంచి విడిపోయింది. 15ఏళ్ల క్రితం భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. శాంతిరాజు భార్య లక్ష్మీనరసమ్మ కొన్నాళ్లుగా నలుగురు పిల్లలతో విజయవాడలో నివసిస్తోంది. ఆర్ధిక ఇబ్బందులతో పిల్లల్ని పెంచలేక పెద్ద కుమారుడు మినహా మిగిలిన ముగ్గురు పిల్లల్ని తండ్రి వద్దకు పంపింది. వారిలో చివరి కుమారుడు ప్రభు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడి తండ్రి శాంతిరాజుకు రెండో భార్య రాధిక ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలంతా తండ్రితో కలిసి ఉంటున్నారు. శనివారం ఇంట్లో పిల్లలంతా కలిసి పబ్జీ ఆడారు. ఆటలో ప్రభు ఓడిపోవడంతో మిగిలిన వారు ఎగతాళి చేశారు. సొంత అక్కలు అవమానించడంతో మనస్తాపానికి గురై, వారితో కలిసి ఉండనంటూ మరో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఉదయం ఎంతసేపటికి బయటకు రాకపోయేసరికి కుటుంబసభ్యులు లోపలకు వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు ఊరేసుకుని కనిపించాడు.
తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొడుకు చనిపోయిన సంగతి తెలిసిన తల్లి భర్తే తన బిడ్డను హతమార్చాడని ఆరోపించింది. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే కొడుకుని చంపేశారని వాపోయింది. తనకు అన్యాయం చేసి, కొడుకును పొట్టన పెట్టుకున్నారని ఆరోపించింది. పోస్టుమార్టంలో వాస్తవాలు తెలుస్తాయని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది.
టాపిక్