Kadapa Bad teacher: విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన..దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు
Kadapa Bad teacher: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని కుటుంబ సభ్యులు చితకబాదిన ఘటన కడప జిల్లాలో జరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన బంధువులు, తల్లిదండ్రులు చితకబాదారు.
Kadapa Bad teacher: కడప జిల్లాలోని ఒక ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థినిని ఉపాధ్యాయుడు బ్యాడ్ టచ్ చేశాడు. దీంతో ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పింది. తనను ఉపాధ్యాయుడు బ్యాడ్ టచ్ చేశాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాఠశాలకు వెళ్లి ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. గతంలో మద్యం మత్తులో స్కూల్‌కు వచ్చి ఇలానే ప్రవర్తించాడని ఆరోపిస్తున్నారు. .
ఈ ఘటన కడప జిల్లాలో పోరుమామిళ్ల మండలంలోని ఒక ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం పాఠశాలలోని ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రత్నమయ్య అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆరో తరగతి చదువుతున్న బాలిక చేతిపై పెన్‌తో పేరు రాసుకుంది. దీంతో ఎస్‌పీఎల్ ఆ బాలిక చేతిపై రాసుకుందని ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయుడు వచ్చి బాలిక చేయి పట్టుకుని పెన్‌తో రాసుకున్న చోటు బ్యాడ్ టచ్ చేస్తూ రుద్దాడు. ఉపాధ్యాయుడి చేష్టలతో బాలిక ఇబ్బందికరంగా ఫీలైంది.
మధ్యాహ్నం ఇంటికి వెళ్లి తన పెద్దనాన్న, తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఇదే ఉపాధ్యాయుడు ఆరు నెలల కింద కూడా ఇలానే ప్రవర్తించాడు. మద్యం సేవించి పాఠశాలకు వచ్చి మద్యం మత్తులో ఆ బాలిక చేయి పట్టుకుని వికృతంగా ప్రవర్తించాడు. దీంతో అప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఎం.రమణయ్యకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిని మూడు నెలల పాటు మెడికల్ లీవులో పంపించేశారు. ఆయన మెడికల్ లీవులు పూర్తి చేసుకుని మళ్లీ రెండు నెలల క్రితమే విధుల్లో చేశారు.
ఆ ఉపాధ్యాయుడు మళ్లీ తన వికృత చేష్టలను బయటపెట్టాడు. బాలిక చేయి పట్టుకోవడం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉపాధ్యాయుడు ప్రవర్తనతో ఇతర బాలికలు కూడా ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గురువారం అదే గ్రామంలో పాఠశాల పక్కనే ఉన్న సచివాలయంలో జరిగే రెవెన్యూ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన ఎంఆర్వో చంద్రశేఖర్ రెడ్డికి విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఆర్వో పాఠశాలను సందర్శించారు.
పాఠశాలలోని బాలికలను అడిగి వివరాలు తెలుసుకున్న ఎంఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, వెంటనే పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి ఘటనపై సమాచారం అందించారు. దీంతో పోలీసులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డి ఈ ఘటనపై తమకు ఎటువంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదని తెలిపారు. మరోవైపు ప్రధానోపాధ్యాయుడు ఎం.రమణయ్య ఈ ఘటనపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. జిల్లా విద్యా శాఖ అధికారి పాఠశాలను సందర్శించే అవకాశం ఉంది. విద్యార్థినిలను విచారించి అవసరమైన చర్యలను తీసుకుంటారని తెలుస్తోంది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)