ఈ ఘటన నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఒక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా ఎం.బొజ్జన్న పని చేస్తున్నాడు. ఆయన పాఠశాలలోని విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. క్లాస్ రూమ్‌లోనూ, బయట కనిపించినప్పుడు విద్యార్థినులను పిలిచి అశ్లీల చిత్రాలను చూపించి వల్గర్‌గా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడపడితే అక్కడ తాకేవాడు. వీడియోలు చూసేందుకు విముఖతం వ్యక్తం చేసిన విద్యార్థినులను తిట్టడం, కొట్టడం చేసేవాడు.
సరస్వతి పూజ రోజు కూడా ఇలాగే ప్రవర్తించాడు. రెండేళ్ల నుంచి ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. విద్యార్థినులను దూషిస్తున్నాడు. విద్యార్థులు బయటకు చెప్పుకోలేక తమలోతామే కుమిలిపోయారు. అయితే ఇటీవలి ఉపాధ్యాయుడి ఆగడాలు, చేష్టలు భరించలేక ఏం జరిగితే, అదే జరిగిందని పదో తరగతి విద్యార్థినులు పాఠశాలోని మహిళ టీచర్లకు ఫిర్యాదు చేసి బోరున విలపించారు. మహిళా టీచర్లు ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు వివరించారు.
ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులను పిలిచి విచారించారు. అన్ని వివరాలు తెలుసుకున్న తరువాత ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుడు బొజ్జన్నను స్కూల్‌కి రావద్దని, సెలవులపై వెళ్లి పోవాలని ఆదేశించారు. సెలవులపై వెళ్లిపోవాలని చెప్పి చేతులు దులుపుకోవడంతో.. విద్యార్థులు తమకు న్యాయం జరగలేదని భావించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు టీచర్ బొజ్జన్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఇలాంటి కీచక టీచర్ ఏ పాఠశాలలో కూడా పని చేయడానికి వీల్లేదని, వెంటనే విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
విద్యార్థినుల తల్లిదండ్రులు మండల విద్యా శాఖ అధికారి (ఎంఈవో), జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో)కి ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు విచారణ చేపట్టి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ప్రాథమికంగా వెల్లడైనందున.. ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉపాధ్యాయుడు రెండు రోజుల నుంచి పాఠశాలకు రావడం లేదని విద్యార్థినులు తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)