Prakasam District : వంట మనిషితో ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన - చెప్పుతో దాడి
పాఠశాల వంట మనిషితో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. గ్రామస్తులు ఉపాధ్యాయుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

ప్రకాశం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వంట మనిషిపై ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో గ్రామస్తులకు విషయం తెలిసి ఉపాధ్యాయుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ ఉపాధ్యాయుడిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. మండల విద్యా శాఖ అధికారి (ఎంఈవో) వస్త్రాం నాయక్ పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు.
ఈ ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం పంచాయతీలోని వీవై కాలనీలో ఒక ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…. వేముల వెంకట రవికుమార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అదే పాఠశాలలో ఒక మహిళ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వంట చేస్తోంది. ఆ మహిళ, మరో మహిళతో మాట్లాడుతుండగా, అక్కడికి వచ్చిన ఉపాధ్యాయుడు తన గురించి ఇతరులకు ఎందుకు చెబుతున్నావంటూ అసభ్య పదజాలంతో దూషించాడు.
మహిళపై దాడి….
సదరు మహిళపై చెప్పుతో దాడి చేశాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు… గ్రామ పెద్దలు అక్కడి వెళ్లి రవి కుమార్‌ను నిలదీశారు. దీంతో ఉపాధ్యాయుడు మీరేంటి నాకు చెప్పేది, అసలు మీరెవరు నన్ను అడగేందుకు అని వారిపై కూడా దాడి చేశాడు. ఉపాధ్యాయుడు ప్రవర్తనతో కోపోద్రికులైన గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పాఠశాల సమీపంలోనే స్తంభానికి తాళ్లతో కట్టేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన పడమర నాయుడుపాలెం పంచాయతీలోని వీవై కాలనీ చేరుకున్నారు.
గ్రామస్తులు, బాధిత వంట మనిషితో పోలీసులు మాట్లాడి వివరాలన్ని సేకరించారు. అనంతరం ఉపాధ్యాయుడు రవి కుమార్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న మండల విద్యా శాఖ అధికారి (ఎంఈవో) వస్త్రాం నాయక్ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఎనిమిదేళ్లుగా ఉపాధ్యాయుడు తమ గ్రామంలో పని చేస్తున్నాడని, విద్యార్థులు, స్థానికులపట్ల అగౌరవంగా, అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతంలో ఆ ఉపాధ్యాయుడు కొన్ని రోజులు సస్పెండ్ కూడా అయ్యారని కాలనీ వాసులు తెలిపారు.
ఆ ఉపాధ్యాయుడు తమకు వద్దని విద్యార్థులు, గ్రామస్తులు కోరారు. ఇప్పటికే ఆయనకు చాలా సార్లు చెప్పి చూశామని, అయినప్పటికీ ఆయన ఎవరి మాట వినరని తెలిపారు. మహిళపై చెప్పుతో కొట్టిన ఆ ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆ ఉపాధ్యాయుడిని తమ స్కూల్ నుంచి తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనికి మండల విద్యా శాఖ అధికారి (ఎంఈవో) వస్త్రాం నాయక్ స్పందిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో)కి నివేదిక సమర్పిస్తానని, ఆయనే ఏ చర్యలు తీసుకోవాలన్న వీలుంటుందని తెలిపారు.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం