AP SSC Paper leak: ఏపీ పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ కేసులో ఉపాధ్యాయుడి అరెస్ట్
AP SSC Paper leak: ఆంధ్రప్రదేశ్ పదోతరగతి సమ్మేటివ్ 1 పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసిన కేసులో ఉపాధ్యాయుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్ అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు కోనసీమ జిల్లా రామచంద్రాపురం స్కూల్ టీచర్‌ను నిందితుడిగా గుర్తించారు.
AP SSC Paper leak: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి సమ్మేటివ్ 1 పరీక్షల్లో పేపర్ లీక్ చేసిన కేసులో నిందితులను విజయవాడ పోలీసులు ఆరెస్ట్ చేశారు. స్టేట్ కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషనల్ రీసర్స్ అండ్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.అరుణ్ కుమార్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని గుర్తించారు.
డిసెంబర్ 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పదవ తరగతి గణితం ఎస్.ఎ.-1 పరీక్ష పేపర్ ముందు రోజు సాయంత్రమే కొన్ని ర యూటుబ్ చానెల్స్‌లో ప్రత్యక్షమైంది. గుర్తు తెలియని వ్యక్తులు పదవతరగతి గణితం ఎస్.ఎ.-1 పరీక్ష పేపర్ లీక్ చేశారని పేపర్ లీక్ చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు సైబర్ క్రైమ్ విభాగానికి దర్యాప్తు అప్పగించారు.
ఈ నేపథ్యంలో ఫిర్యాది ఇచ్చిన యూట్యూబ్ లింక్‌ల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా యూ ట్యూబ్‌లో గణితం ఎస్.ఎ.-1 పరీక్ష పేపర్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాలుడు అప్‌లోడ్ చేసినట్టు గుర్తించి అతడిని విచారించారు.
ఆ బాలుడు విజయవాడకు చెందిన బాలుడి టెలిగ్రాం ఛానల్ నుండి ఆ పేపర్ పొందినట్లు పోలీసులకు చెప్పాడు. ఆ టెలిగ్రాంఛానల్ వివరాలను సేకరించి దర్యాప్తు కొనసాగించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రాపురం మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రామచంద్రపురానికి చెందిన తీపర్తి వీర వెంకట సుబ్బారావు (51 సం.) పేపర్ లీక్ చేయడానికి కారణం అని గుర్తించారు.
ఉపాధ్యాయుడిని అదుపులోనికి తీసుకుని విచారించిన పోలీసులు రామచంద్రాపురం లోని ఎం.ఈ.ఓ. ఆఫీస్ నుండి స్కూల్ కి ప్రశ్నా పత్రాలను తీసుకురావడానికి వెళ్లే క్రమంలో తన స్కూల్‌లో చదువుతున్న పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చి స్కూల్ ఇమేజ్ పెంచాలని ఉద్దేశపూర్వకంగా రామచంద్రాపురం ఎం.ఈ.ఓ. శ్రీనివాసరావుతో కలిసి పేపర్ లీక్‌కు పాల్పడ్డాడు.
డిసెంబర్ 13న ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాలను తీసుకురావడానికి వెళుతున్న సమయంలో, ఎం.ఈ.ఓ. శ్రీనివాసరావు ఆధీనం ఉన్న బల్క్ ప్రశ్నా పత్రాలు కలిగిన ట్రంక్ పెట్టి తాళం తిసి, అందులో డిసెంబర్ 16వ తేదీన జరిగే లెక్కల ప్రశ్నా పత్రాలలో, ఒకటి తీసుకుని తన జేబులో పెట్టుకుని స్కూల్ కి వెళ్ళిపోయాడు.
ఇంగ్లిష్ పరీక్ష ముగిసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఆ స్కూల్ చెందిన పదవ తరగతి స్టూడెంట్ కు దానిని ఇచ్చి 16వ తేదీన జరిగే లెక్కల పరీక్షకు ఇదే ప్రశ్నాపత్రం వస్తుంది అందరూ బాగా చదువుకుని పరీక్ష బాగా రాయాలని సూచించారు. ఆ విద్యార్థిని ప్రశ్నాపత్రం ఫోటో తీసుకుని తన మిత్రులకు షేర్ చేసింది. అలా ఒకరి ద్వారా మరొకరు టెలిగ్రాం చానెల్స్ ద్వారా షేర్ చేసుకుంటూ యూట్యూబ్‌కు చేరిపోయింది.
లెక్కల పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసిన రామచంద్రపురానికి చెందిన తీపర్తి వీర వెంకట సుబ్బారావుతో పాటు రామచంద్రాపురం ఎం.ఈ.ఓ. మానుపుడి శ్రీనివాసరావులను ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు.