CPM On TDP: పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై టీడీపీ మౌనం రాష్ట్రానికి ప్రమాదకరం.. పార్లమెంటులో ప్రశ్నించాలని సీపీఎం డిమాండ్-tdps silence on delimitation of parliamentary seats is dangerous for the state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cpm On Tdp: పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై టీడీపీ మౌనం రాష్ట్రానికి ప్రమాదకరం.. పార్లమెంటులో ప్రశ్నించాలని సీపీఎం డిమాండ్

CPM On TDP: పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై టీడీపీ మౌనం రాష్ట్రానికి ప్రమాదకరం.. పార్లమెంటులో ప్రశ్నించాలని సీపీఎం డిమాండ్

Sarath Chandra.B HT Telugu

CPM On TDP:పార్లమెంటు సీట్లు పునర్విభజనపై టీడీపీ మౌనం రాష్ట్రానికి హానికరమని సీపీఎం అభిప్రాయపడింది. బీజేపీ కుట్రలో భాగస్వామ్యం కావద్దని, డిఎంకె ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకపోవడం రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని, పార్లమెంటులో టిడిపి,జనసేన ఎంపిలు ప్రశ్నించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇస్తున్న సీపీఎం నేతలు (ఫైల్ ఫోటో)

CPM On TDP: పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కూటమి పార్టీలు అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రానికి హానికరమని, దీనిపై టీడీపీ మౌనం రాష్ట్రానికి హానికరమని సీపీఎం ఆరోపించింది. టీడీపీ, జనసేన పార్టీల వైఖరి ఏమిటో చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు.

పార్లమెంటు నియోజక వర్గాల డీలిమిటేషన్‌పై డిఎంకె ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తప్ప దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అన్ని పార్టీలూ ఒక తాటిమీదకు వచ్చి హాజరయ్యాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టమని, పార్లమెంటులో ప్రాధాన్యత తగ్గేందుకు దారితీస్తుందని తెలిపారు.

మోడీతో దోస్తీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన గోడమీద పల్లివాటంగా డ్యాన్స్‌ చేస్తున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో వైసిపి హాజరుకాకపోయినా కనీసం లేఖ రాసిందని, కూటమి పార్టీలు ఆపని కూడా చేయకపోగా ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నాయని విమర్శించారు.

జనసేన పార్లమెంటులో ప్రశ్నించాలి…

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆయా పార్టీల నాయకులు డీలిమిటేషన్‌పై ముందు పార్లమెంటులో లేవనెత్తాలని అంటున్నారని, జనసేన పార్టీ సభ్యులు లోక్‌సభలో ఎందుకు లేవనెత్తలేదో సమాధానం చెప్పాలన్నారు. అసలు డీలిమిటేషన్‌ లాభమో, నష్టమో అదన్నా స్పష్టం చేయాలన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై మాట్లాడకుండా అసెంబ్లీలో 75 సీట్లు మహిళలకు పెరుగుతాయని చెబుతూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25 పార్లమెంటు సీట్లు ఉన్నాయని, అవి తగ్గుతాయా పెరుగుతాయా అదన్నా చెప్పాలన్నారు.

జనాభా ప్రాతిపదికతో రాష్ట్రానికి నష్టం…

జనాభా ప్రతిపదికన గనుక సీట్లు కేటాయిస్తే దేశంలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ లాంటి ఒకటీ రెండు రాష్ట్రాలకు తప్ప ఎక్కువ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల బిజెపి పాలిత రాష్ట్రాలకు ఉపయోగం తప్ప దేశంలో మరెవరికీ సీట్లు పెరగవని అన్నారు.

దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభాను తగ్గించాయని, జనాభా ప్రాతిపదికన అయితే గనుక దేశాభివృద్ధికి తోడ్పడిన రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందని పేర్కొన్నారు. దీనికోసమే బిజెపి కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంటే రాష్ట్రంలో టిడిపి, జనసేన సమర్థించే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.

డీలిమిటేషన్‌ చేసేటట్లయితే ప్రస్తుతం పార్లమెంటులో ఎంత శాతం సీట్లు పెరుగుతున్నాయో రాష్ట్రాలకు కూడా అలాగే సీట్ల ప్రాతిపదికగా పెరుగుదల శాతాన్ని పరిగణనలోకి తీసుకుని సీట్లు పెరగాలని తెలిపారు. ప్రస్తుత జనాభా ఆధారంగా సీట్లు పెరిగితే ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయని, ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీల ఉనికిని కూడా ఇది దెబ్బతీస్తుందన్నారు.

హైదరాబాద్‌ సమావేశంలో అయినా వైఖరి చెప్పాలి…

డీ లిమిటేషన్‌పై హైదరాబాద్‌లో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని, దానికన్నా రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీలు, వైసిపి హాజరై అభిప్రాయం చెప్పాలన్నారు. టిడిపి తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పడిరదని, మోడీకి భయపడి మౌనం వహిస్తే దానివల్ల సీట్లు తగ్గితే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని వివరించారు. కూటమి పార్టీలు జగన్‌ రాసినట్లు కనీసం వారి అభిప్రాయాన్ని మోడీకి చెబుతూ లేఖ రాయాలని తెలిపారు. దీనిపై కూటమి పార్టీలు స్పందించకపోతే భవిష్యత్‌లో ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసిన వారవుతారన్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం