CBN Struggle: అయ్యో బాబు ఇదేం ఖర్మ.. విమర్శలు, ఆరోపణలు ఖండించలేరు, కాదనలేరు.. తిప్పి కొట్టడంలో ఎందుకు తడబాటు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కొత్త సమస్య వచ్చి పడింది. అధికారంలోకి వచ్చామనే సంతోషం కంటే ప్రత్యర్థుల ప్రచారాలు,ఆరోపణల్ని తిప్పి కొట్టలేని పరిస్థితిని చంద్రబాబు అండ్ కో ఎదుర్కొంటోంది. అధికారంలోకి వచ్చాక ఎవరికి వాళ్లు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోవడం, పదవులు వచ్చే వరకు వేచి చూద్దామనే ధోరణి దీనికి కారణం.
CBN Struggle: ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 స్థానాలతో ఘన విజయాన్ని సాధించిన సంతోషం ఆ పార్టీకి ఎక్కువ రోజులు నిలిచేలా లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 15-20 రోజుల్లోనే వైసీపీ అధికార పార్టీకి వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఓటమి నుంచి తెరుకోక ముందే వైసీపీ తన సోషల్ మీడియా టీమ్‌లను యాక్టివేట్ చేసి అధికార పార్టీని దుమ్మెత్తి పోయడంలో సక్సెస్ అయ్యాయి. వాటిని తిప్పి కొట్టే వ్యూహం టీడీపీ శిబిరంలో కనిపించ లేదు. ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా బృందాలు యాక్టివ్‌గా టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో సక్సెస్ అవుతున్నాయి.
అదే సమయంలో టీడీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా బృందాలు మాత్రం పూర్తిగా రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. ఆన్‌లైన్ అసత్య ప్రచారాలు, విమర్శలు, ఆరోపణల్ని తిప్పి కొట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ తరపున ఎన్నికకు ముందు రాబిన్ శర్మ నేతృత్వంలోని బృందాలతో పాటు పార్టీ సోషల్ మీడియా విభాగాలు, సీబీఎన్ ఆర్మీ బృందాలు క్రియాశీలకంగా పనిచేశాయి. వీరితో పాటు పార్టీ కోసం స్వచ్ఛంధంగా పనిచేసిన వాళ్లు కూడా ఉన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల విభాగాల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రత్యర్థుల విమర్శలు, సోషల్ మీడియా ప్రచారాలను తొలినాళ్లలోనే గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మీడియా ప్రచారాలు, పత్రికల్లో వచ్చే కథనాలకు ఎప్పటికప్పుడు ఖండించడంతో పాటు వాస్తవాలను ప్రజలకు వివరించాలని సమీక్షల్లో సూచించారు. అయితే రెండున్నర నెలలుగా అవి ఏమి అమలు కావడం లేదు.
బాబు తరహా పీఆర్ ఎక్కడ…
చంద్రబాబు అంటేనే బ్రాండింగ్, పబ్లిసిటీ అనే దానికి భిన్నమైన వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. బాబుకు తొలినాళ్ల నుంచి దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఆయన అనుసరించిన మీడియా స్ట్రాటజీలే కారణమని ఎవరైనా చెబుతారు.
రాష్ట్ర విభజన తర్వాత 2014-19మధ్య కూడా ఏపీ సీఎంగా చంద్రబాబే ఉన్నారు. అప్పటికి, ఇప్పటికి భిన్నమైన పీఆర్ కమ్యూనికేషన్ కనిపిస్తోంది. మీడియా ప్రచారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పుడు అది కొరవడింది. విమర్శలు, ఆరోపణలకు అధికారికంగా సమాధానం ఇచ్చే యంత్రాంగం సీఎంఓలో ఇప్పటి వరకు లేదు. సమాచార శాఖ అధికారుల ద్వారా సమాచారాన్ని విడుదల చేస్తున్నా, అధికారిక వివరణల కోసం ఎవరిని సంప్రదించాలనే దానిపై స్పష్టత కొరవడింది.
ఇవిగో ఉదాహరణలు...
- చంద్రబాబు ముఖ‌్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండున్నర నెలల్లో నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు.సీఎం తొలి రెండు పర్యటనల్లో ఏం జరిగిందో తెలుసుకోడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. అధికారిక హ్యాండిల్స్‌లో ఫోటోలు విడుదల చేసి ఐఅండ్‌పీఆర్ చేతులు దులుపుకుంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన విశేషాలను వివరించడంలో విఫలమయ్యారు.
- వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్య నేపథ్యంలో జరిగిన పరిణామాలను వివరించడంలో కూడా పోలీసులు, సిఎంఓ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పనిచేయడం లేదని సొంత వాహనంలో వెళ్లారు. తనకు భద్రతను కుదించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ సెక్యూరిటీ విషయంలో ఏమి జరిగిందో వివరించడానికి అటు సిఎంఓకు, ఇటు పోలీసులకు ఒక పూట సమయం పట్టింది. అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది.
- ఇటీవల గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ముఖాముఖిలో ఓయువకుడు తాను తోపుడు బండిపై చికెన్ అమ్ముకుంటానంటూ బాబుతో చెప్పారు. ప్రభుత్వం తరపున సాయం అందిస్తే స్వయం ఉపాధి పొందుతానంటూ చెప్పాడు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆ యువకుడు స్థానిక ఎమ్మెల్యే అనుచరుడని, హోటళ్లలో గతంలో చేసిన వ్లాగ్ వీడియోలను వైసీపీ విపరీతంగా ట్రోల్ చేసింది.
- గుడివాడలో నిర్వహించిన కార్యక్రమాన్ని పొలిటికల్ కన్సల్టెన్సీకి అప్పగించడంతో ఈ సమస్య తలెత్తినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండున్నర నెలల్లో ప్రధాన ప్రతిపక్షం చేసే ఆరోపణల్ని తిప్పి కొట్టడంలో టీడీపీ శిబిరం విఫలమైన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇసుక ధరలు, మద్యం పాలసీ, సూపర్ సిక్స్ హామీల అమలు వంటి విషయాల్లో వైసీపీ చెలరేగిపోతున్న టీడీపీ నుంచి స్పందన కొరవడుతోంది.
పెన్షన్లపై దుమారం...
ఏపీలో 2024 జూన్ నాటికి ఏటా 66 లక్షల మంది పింఛన్లకు పెన్షన్ల కోసం ఏటా రూ.24వేల కోట్ల రుపాయల్ని ప్రభుత్వం వెచ్చించింది. వైఎస్సార్ ఆసరా పథకంలో వివిధ రకాల సామాజిక పెన్షన్లలో భాగంగా రాష్ట్రంలో 78,94,169మందికి లబ్ది కలిగింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 78,94,169మందికి రూ.25,570కోట్లను ఏటా చెల్లించారు. ఇప్పుడు అది రూ.35వేలకు చేరింది. ప్రతి నెల పెన్షన్లకు రూ.2600కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీలో పెద్ద ఎత్తన సామాజిక పెన్షన్లను తొలగిస్తున్నారనే ప్రచారం జరిగింది. పత్రికల్లో పతాక స్థాయిలో కథనాలు వచ్చినా ఈ ప్రచారాన్ని అడ్డు కోవడంలో కూడా టీడీపీ విఫలమైంది. పెన్షన్లలో అసలైన గణంకాలను కూడా విడుదల చేయలేకపోయారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం 2014-19 మధ్య కాలంలో ఏపీలో 19లక్షల కొత్త పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర విభజన నాటికి ఉన్న పెన్షన్లకు అదనంగా 19లక్షల పెన్షన్లు ఇచ్చారు. 2019-24 మధ్య కాలంలో 10లక్షలకు పైగా పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించింది. అందులో దాదాపు ఆరున్నర లక్షల పెన్షన్లు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు చెందినవి ఉన్నాయి.
కాంట్రాక్టు ఉద్యగం చేసినా పెన్షన్‌కు అర్హత లేదని నిర్ణయించి లక్షలాది పెన్షన్లను రద్దు చేశారు. ఇంట్లో కారు ఉన్న వారు, పరిమితికి మించి వ్యవసాయ భూమి ఉన్నవారు. ఆదాయ పన్ను చెల్లించేవారు. ప్రభుత్వ ఉద్యోగులు వంటి వారికి ఆరు ప్రమాణాల ఆధారంగా రేషన్ కార్డులను పెద్ద ఎత్తున తొలగించారు. వైసీపీ హయంలో 10లక్షలకార్డుల్ని ఇలా తొలగించారు. మరో 12లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. తొలగించిన వాటితో పోలిస్తే వైసీపీ ప్రభుత్వంలో 2లక్షల రేషన్ కార్డులు మాత్రమే మంజూరు చేసినట్టు సాంఘక సంక్షేమ శాఖ చెబుతోంది.
ఖండనలు లేవు, వివరణలు అసలే లేవు...
రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు పథకాల అమలు, నిర్ణయాలపై సందేహ నివృత్తి చేసే యంత్రాంగమే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో లేకుండా పోయింది. ఇటీవల పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ఆస్పత్రలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారు. దానిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో మర్నాడు ఐఏఎస్ అధికారులకు చంద్రబాబు చివాట్లు పెట్టినట్టు సమాచారం.
ఆస్పత్రుల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాటు ఎంసిఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త కాలేజీల ఏర్పాటుపై ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పద్ధతుల్ని అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. ఆస్పత్రుల నిర్మాణంలో వయబిలిటీ గ్యాప్‌ను ప్రభుత్వం సమకూరిస్తే నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవచ్చని, దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని బాబు సూచించారు. దానికి మరో అర్థం వచ్చేలా ప్రకటన విడుదల కావడంతో బాబు తల పట్టుకోవాల్సి వచ్చింది. +