ప్రజల జీవితాలను మార్చేందుకే టీడీపీ పుట్టింది: మహానాడులో చంద్రబాబు-tdp was born to change people lives chandrababu naidu says at party rally ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ప్రజల జీవితాలను మార్చేందుకే టీడీపీ పుట్టింది: మహానాడులో చంద్రబాబు

ప్రజల జీవితాలను మార్చేందుకే టీడీపీ పుట్టింది: మహానాడులో చంద్రబాబు

HT Telugu Desk HT Telugu

మూడు రోజుల పాటు జరిగే టీడీపీ మహానాడులో చివరి రోజు జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో పార్టీ మద్దతుదారులు తరలిరావడం తనకు ధైర్యాన్నిచ్చిందన్నారు.

టీడీపీ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ (HT_PRINT)

కడప, మే 29: ప్రజల జీవితాలను మార్చేందుకే తమ పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రోజుల పాటు జరిగే టీడీపీ మహానాడులో చివరి రోజు జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో పార్టీ మద్దతుదారులు తరలిరావడం తనకు ధైర్యాన్నిచ్చిందన్నారు.

వైఎస్సార్ కుటుంబానికి కంచుకోటగా భావించే కడపలో మహానాడు నిర్వహించి టీడీపీకి గట్టి పట్టుందని నిరూపించారు. 2024 ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతం 52 అసెంబ్లీ స్థానాలకు గాను 45 సీట్లు గెలుచుకుని ఎన్డీయేను ఆశీర్వదించిందని చెప్పారు.

ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీని ఎలా నడపాలో టీడీపీ కేస్ స్టడీ అని, ఎలా నడపకూడదో వైసీపీ ఒక ఉదాహరణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలు, హత్యలు, దూషణలు, అణచివేతలతో నిండిపోయిందని, ఆ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లకు తారుమారైందని ఆరోపించారు.

రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని, ఏటా రూ.40 వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అయితే 2029 నాటికి జీరో పేదరికాన్ని సాధిస్తామని, అందరికీ ఇళ్లు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

రాయలసీమకు పెద్దపీట

రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి పెద్ద పీట వేస్తూ, ఈ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కడపలో హజ్ హౌస్ నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

టిడిపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడి జూన్ 12తో ఏడాది పూర్తవుతున్నందున, అంతకు ముందే కడప ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభమవుతాయని, మొదటి దశ రూ.4,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అలాగే శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుతో పాటు గొప్ప భౌగోళిక ఆకర్షణగా ఉన్న గండికోటను ఉత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని యువతను తన బలంగా అభివర్ణించిన ఆయన, వారిపై ఆశలు పెట్టుకున్నానని, వారిని పైకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. మహానాడులో ప్రవేశపెట్టిన ఆరు కీలక తీర్మానాలు చారిత్రాత్మకమైనవని, సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

యోగా దినోత్సవానికి ప్రధాని

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖలోని ఆర్కే బీచ్ లో జరిగే యోగా తరగతుల్లో ఐదు లక్షల మంది పాల్గొంటారని, ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని తెలిపారు.

ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగాలో పాల్గొంటారని, 20 లక్షల మంది ఔత్సాహికులకు సర్టిఫికెట్లు అందజేస్తామని సీఎం తెలిపారు.

ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ ఉగ్రవాదులు 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారని, కానీ ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించారని, పాకిస్తాన్లోకి ప్రవేశించి 20 నిమిషాల్లో వారిని (ఉగ్రవాదులను) మట్టుబెట్టారని అన్నారు.

బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం తనకు ధైర్యాన్ని ఇచ్చిందని, తన కృషిని ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మూడు రోజుల మహానాడును ముగించిన చంద్రబాబు జై టీడీపీ, ఎన్టీఆర్ అమర్ రహే నినాదాలతో తన ప్రసంగాన్ని ముగించారు.

1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) టీడీపీని స్థాపించారు. అంతకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగిస్తూ ఎన్టీఆర్ వారసత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రపంచ దార్శనికతతో కొనసాగిస్తున్నారని ఉద్ఘాటించారు.

టీడీపీ నేతలు అనుచరులు కాదని, ట్రెండ్ సెట్టర్లు అని, ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో సగర్వంగా నిలుపుతున్న తెలుగు ప్రజల ప్రపంచ ముఖమని లోకేశ్ అన్నారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.